
తెలంగాణ గుండె గోస వినిపించిన కవి అందెశ్రీ ఇక లేరు. అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ అన్న గీతికతో మన ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు.
అందెశ్రీ ప్రస్థానంలో ఎన్నెన్నో ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. 1961 జూలై 18న, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో డా. అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి, కష్టాలతో నిండిన బాల్యం గడిపారు. చదువుకి అవకాశాలు లేక, గొర్రెల కాపరిగా జీవితం ప్రారంభమైంది. ఆ జీవితం నుంచే ఆయనకు వచ్చింది. ప్రజా వేదనను పదాల్లో పలికించే శక్తి.
ఆయన పెద్దగా చదువుకోలేదు. పల్లె పొదల్లో, చెరువు కట్టల దగ్గర విన్న పల్లె పదాలు, చూసిన దృశ్యాలు ఆయనకు పాఠశాల అయ్యాయి. చిందు యక్ష గానం, హారికథ, బుర్ర కథ, మొదలైన పల్లె కళ రూపాలే ఆయనకు గురువులయ్యాయి. తెలంగాణ భాషా, యశగా గళం విప్పాయి. ఎన్నో అభ్యుదయ బావలు, సత్య శోదన, ఆదర్శ బావాలు ఉన్న అందరిని కలుపుకొని పోయే మూర్తిభావించిన మేధావి డా. అందేశ్రీ.
తెలంగాన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యమం స్ఫూర్తిగా ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం తెలంగాణ ప్రజల ఆత్మ గీతంగా నిలిచింది. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన రోజుల్లో ఈ గీతం ప్రతి ఊర్లో, ప్రతి ప్రదర్శనలో ప్రతిధ్వనించింది. ఈ పాట ప్రజల మనస్సుల్లోని ఆవేదనను, గర్వాన్ని, స్ఫూర్తిని ఒకే గీతంలో మలచిన అద్భుత సృష్టి ఉద్యమ వ్యాప్తిలో ఆయన కృషి స్లాగనీయం…
అందెశ్రీ కలం తెలంగాణ మట్టికి, బాషకు, ఆత్మ గౌరవ పోరాటానికి మార్గం చూపింది. ఉద్యమం నడిచిన ప్రతి చోట ఆయన ముద్ర కనపడుతుంది. ఆయన రాసిన కొన్ని అజరామర గీతాలు, కవితలు. పల్లెనీకు వందనములమ్మో…., మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు…, గల గల గజ్జెల బండి…., కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా…., మొదలగు గీతాలన్నీ ఆయన ప్రజలతో ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ జీవితాన్ని, సమాజపట్ల ఆయన కర్తవ్య భావాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ స్ఫూర్తిని మాత్రమే కాదు, తెలుగు సినిమా గీతాలకు కూడా ఆయన తన ముద్ర వేశారు. “గంగ” అనే చిత్రానికి రచించిన గీతానికి 2006లో నంది పురస్కారం లభించింది. విప్లవ సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తితో ఆయన సంబంధం విడదీయలేని అనుభందం.
ప్రశంసలు:
అందెశ్రీ ని వెదక్కొంటూ అనేక అవార్డులు వచ్చాయి. అకాడమీ అఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ (వాషింగ్టన్ D.C.) నుండి “లోక కవి” బిరుదు (2014). డా. రావూరి భరద్వాజ్ సాహితీ పురస్కారం (2015),దాశరథి సాహితీ పురస్కారం (2015), తెలంగాణ ప్రభుత్వ పురస్కారం ₹1 కోటి, సాహితీ కృషికి గుర్తింపుగా (2025) అవార్డులు తనకు వచ్చిన రాకున్న సహచర మిత్రులు ఏ అవార్డులు, పదవులు, పురస్కారాలు పొందిన రాగ, ద్వేషం లేకుండా తన నమ్మిన బావాలకు కట్టుబడి ఉండే మహా సాహితీ వేత్త డా. అందేశ్రీ.
వ్యక్తిగతం.. వ్యక్తిత్తం.. :
అందెశ్రీ గారికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుటుంబం సాంప్రదాయక పల్లె టూరి జీవన శైలిలో కొనసాగుతూ ఆడంబరాలకు దూరంగా ఉంటారు . డా.అందెశ్రీ జీవితం సాక్షాత్ తెలంగాణ పోరాట చరిత్రతో మిళితమైంది. ఆయన కవిత్వం సామాన్యుడి కంఠధ్వని, ఆయన పదాలు తెలంగాణ ఆత్మ, చదువు లేకున్నా, చైతణ్యం నిండిన మాటలు రాయగల సామర్థ్యం ఆయనకు ఉన్న శక్తి. అందుకే ఆయన తెలంగాణలో మాత్రమే కాదు, మొత్తం తెలుగు సాహిత్య లోకంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయనను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గర్వంగా “తెలంగాణ కవి”గా పిలిచింది.
నివాళి:
“జయ జయహే తెలంగాణ” గీతం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం ఆలకించినా, ఆ గీతం వెనుక వినిపించేది ఆయన గుండె చప్పుడు. ఈ భూమి ఉన్నంత వరకు ఈ గేయం ఎప్పుడు వినిపిస్తుంది… ఆ గేయంలో డా. అందేశ్రీ జీవించి కలకాలం ఉంటారు. అందుచేత అందెశ్రీ భౌతికంగా దూరమైన, ఆయన గేయం ద్వారా శాశ్వతంగా నిలిచే ఉన్నారు.



