హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని, జీవో వల్ల తమకు నష్టం జరుగుతుందంటూ… జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పలువురు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్ సస్పెండ్ చేసింది.
తెలంగాణలో 33 కొత్త జిల్లాల ప్రకారం స్థానిక క్యాడర్ కేటాయింపులను పూర్తి చేసిన ప్రభుత్వం.. పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో 402 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జారీ అయిన నూతన ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం.. పరస్పర బదిలీలు చేసుకునే ఉపాధ్యాయులు పాత జిల్లాల్లో తమకున్న సీనియారిటీని కోల్పోతారు. పరస్పర బదిలీ అనంతరం కొత్త జిల్లా క్యాడర్లో చివరి ర్యాంకు నుంచి మళ్లీ సీనియారిటీ మొదలవుతుంది. అయితే ఈ జీవో నెంబర్ 402 ద్వారా ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఉపాధ్యాయుల తరపున న్యాయవాది వాదనలు వినించారు. దీంతో హై కోర్టు.. జీవో నెంబర్ 402 ను సస్పెన్షన్ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేసింది కోర్టు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)