జమిలి ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లుని త్వరలోనే పార్లమెంటుకి తీసుకొని వస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే 2,3 నెలల్లో ఈ బిల్లుని ఆమోదించి జమిలి ఎన్నికలకు శ్రీకారం చుడతారు. 2026 లేదా 2027 లోనే ఎన్నికలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అప్పుడు పార్లమెంటు తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికలకు జరుగుతాయి. మొన్న మొన్ననే కొలువు దీరిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సిద్దపడాల్సి ఉంటుంది.
జమిలి ఎన్నికల మీద కీలక నిర్ణయం జరిగింది. అన్ని చోట్ల ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ముద్ర వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం.
జమిలి ఎన్నికల కోసం ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టారు. దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు ఇందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అందుచేత జమిలి ఎన్నికలను తీసుకొని రావటం ఖాయం గా కనిపిస్తోంది.