తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటుకి రంగం సిద్ధం అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ దిశగా కార్యాచరణ ను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా సమావేశం అవుతున్నట్లు సమాచారం. సీఎం గా రేవంత్ రెడ్డిని మార్చేయాలని కొందరు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగినట్లుగానే జిల్లాల్లో ఎమ్మెల్యేలను కూడగడుతున్నారు అని ప్రచారం జరుగుతోంది.
…
శుక్రవారం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో పది మంది దాకా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ ఎమ్మెల్యేల పేర్లతో సహా మీటింగ్ వివరాలు బయటకు వచ్చేశాయి. నియోజక వర్గాల నిధుల గురించి కలిశాం అని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ, అక్షరాలా అసమ్మతి సమావేశమే అన్నది సుస్పష్టం. అన్ని వైపులా సమాచారం పొక్కిపోవటంతో.. ఈ భేటీని సమన్వయం చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బయట పడ్డారు. భేటీ నిజమే కానీ, ఎమ్మె ల్యే ఫండ్స్ విషయం మాట్లాడుకోవాలని భావించామని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీతో చర్చలు జరిపిన తరువాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది.
….
ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గానే తీసుకొన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించారు. జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న మంత్రులు, తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ ఎజెండాగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు సీఎం కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఎమ్మెల్యేల తిరుగుబాటుకు దారితీసిన కారణాల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
…
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం కట్టలు తెంచుకొన్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇన్‌చార్జ్జి మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని చెప్పినట్టు సమాచారం.
ఈ ఎన్నికలు మన పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న సమయంలో కలిసి పనిచేయాల్సిందిపోయి తిరుగుబాటు చేయడం మంచిది కాదని సీఎం మండిపడ్డారు. స్థానిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ దేనికి సంకేతమనే ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించి వారిని కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా మంత్రులకు సూచించినట్టు తెలిసింది.
……..
కాంగ్రెస్‌లో అసమ్మతి మీద అధిష్టానం కూడా సీరియస్ గా దృష్టి పెడుతోంది. పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని, యుద్ధప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాం డ్ నిర్ణయించినట్టు సమాచారం. వీటికితోడు రసహ్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు. మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ వద్దకు ఈ అంశం చేరినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం.
…
మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టిందన్న మాట అంతకంతకూ బలపడుతోంది. దీని మీద ఇటు రాష్ట్ర స్థాయిలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. పది మంది ఎమ్మెల్యేలు కలిసినంత మాత్రాన రేవంత్ సీటుకి ఢోకా ఏమీ లేదని, ఇదంతా టీ కప్పులో తుపాన్ మాత్రమే అని సీఎం వర్గీయులు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ లో కుట్రలు, కుతంత్రాల గురించి తెలిసిన వారు మాత్రం… ఇది సీరియస్ మ్యాటరే అని అంటున్నారు.