రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో మార్పులు..
రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్టైలే వేరు. ప్రతి నాయకుడికి సీటు కింద కుంపటిపెట్టడం కాంగ్రెస్ కల్చర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది.
………….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారంటూ కొందరు సీనియర్లు .. కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలలో సీనియర్లను కలుపుకొని పోవడం లేదంటూ బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కూడా రేవంత్ రెడ్డికే అనుకూలంగా ఉన్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలలో దీపా దాస్ మాటకు రేవంత్ సర్కార్ విలువ ఇస్తోంది. దీంతో సీనియర్ల అసమ్మతి అంతకంతకు పెరుగుతోంది.
……..
మరోవైపు కొందరు మంత్రుల మీద ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగర వేస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండుసార్లు ప్రైవేటు హోటళ్ళ లో ఎమ్మెల్యేలు ప్రైవేటు మీటింగ్‌లు పెట్టుకున్నారు. మంత్రులను తప్పించాలని.. లేదంటే హై కమాండ్‌కు తమ తడాఖా తెలియజేస్తామని వార్నింగ్ లు ఇస్తున్నారు. సీఎల్పీ మీటింగ్ లో కూడా ఎమ్మెల్యేల అసమ్మతి ఏమాత్రం తగ్గలేదు. పైగా ప్రభుత్వం మీద అసమ్మతిని మంత్రుల మీదకు మళ్లించేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు.
…….
అసమ్మతి విషయాన్ని పసికట్టిన కాంగ్రెస్ హై కమాండ్ చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ వ్యవహారాలు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ హైదరాబాద్ చేరుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుపడుతున్నారు. లేదంటే జిల్లాలో పార్టీ పరిస్థితి చతికిల పడుతుందని తేల్చి చెబుతున్నారు.
………
ఎమ్మెల్యేల అసమ్మతి వెనక కొందరు సీనియర్ల హస్తం ఉందనేది మంత్రుల వాదన. వెనకనుంచి రహస్య శక్తులు ఈ నాటకం ఆడిస్తున్నాయని గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు మొదలుపెడితే గందరగోళం మరింత పెరుగుతుందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ ఒకే నాయకత్వంతో ముందుకు వెళ్తున్నామని,, ఇప్పుడు హై కమాండు జోక్యం చేసుకుంటే పరిస్థితి అదుపు తప్పుతుందని తేల్చి చెబుతున్నారు.
……….
దీంతో ఎమ్మెల్యేలకు.. మంత్రులకు,,, సర్ది చెప్పలేక కాంగ్రెస్ హై కమాండ్ తల పెట్టుకుంటోంది. ఈలోగా కుల గణన అంశము పార్టీ నాయకుల మధ్య చిచ్చును రాజేసింది. రెడ్డి వర్సెస్ బీసీలు అన్న తరహాలో కాంగ్రెస్ లో గ్రూపులు తయారవుతున్నాయి. దీంతో మంత్రివర్గం జోలికి వెళ్లాలా వద్దా అనేది పెద్ద పజిల్ గా మారిపోయింది.