విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యోగుల వివరాలు వింటూ ఉంటాం. కానీ ఉత్తరాంధ్ర మన్యం జిల్లాలో జరిగిన ఘటన మాత్రం కన్నీళ్లు తెప్పించక మానదు.
పార్వతిపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ఉండదు. వాగులు వంకలు దాటుకుంటూ టీచర్లు వెళ్లి పాఠాలు చెప్పి వస్తూ ఉంటారు. సరైన సౌకర్యాలు కల్పించమని అధికారులకు ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి ఉండదు.
పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఈ క్రమంలో స్కూలుకు వెళ్లి పాఠాలు చెప్పేందుకు ఇద్దరు టీచర్లు బయలుదేరారు. వాగులు దాటి వెళ్ళద్దని స్థానికులు చెబుతుంటే.. పిల్లలకు పాఠాలు పోతాయి అంటూ ముందుకు సాగారు.
పాచిపెంట మండలం సరాయివలస వద్ద వట్టిగెడ్డలో ఇద్దరు బైక్ మీద ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాగు తీవ్రంగా పొంగడంతో బైకు పడిపోయి ఇద్దరు టీచర్లు నీళ్లలోకి కొట్టుకొని పోయారు.
వీరిని కొటికిపెంట ఏకలవ్య మోడల్ హైస్కూల్ కు చెందిన వార్డెన్ మహేష్,సోషల్ టీచర్ ఆర్తి గా గుర్తించారు.
గల్లంతైన ఉపాధ్యాయులు కోసం వాగులో గాలిస్తుండగా మొదటగా టీచర్ ఆర్తి మృతదేహం లభ్యం అయింది. తర్వాత గాలింపు చర్యల్లో భాగంగా వార్డెన్ మహేష్ మృతదేహం లభించింది.
ఇద్దరు ఉపాధ్యాయుల మృతదేహాలను సాలూరు ఆసుపత్రికి తరలించారు.
మృతిచెందిన ఇద్దరు టీచర్లు హర్యానా రాష్ట్రానికి చెందిన వారు. ఆర్తి,మహేష్ మృతదేహాలను చూసి విద్యార్థులు తల్లితండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మారుమూల గ్రామాల్లో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కష్టమవుతోందని తెలిసినప్పటికీ ఈ ఇద్దరు టీచర్లు నిబద్ధతతో పనిచేస్తూ వచ్చారు. అదే క్రమంలో పిల్లలకు పాఠాలు పోతాయి అన్న బెంగతో వాగులోకి సైతం ముందుకు సాగారు. అదే చివరి మజిలీ అవుతుందని ఇద్దరు భావించలేదు.