ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీ ని ఖాళీ చేసే దిశగా వేట ఊపందుకొంది. వైసీపీ పార్టీని ఒంటరిని చేసిన తెలుగుదేశం కూటమి.. ఇప్పుడు తెలివిగా పావులు కదుపుతోంది. వైసీపీ కి వెన్నుముక లాంటి వ్యవస్థలను కూల్చేసేందుకు ప్రణాళికను అమలు చేస్తోంది. త్వరలోనే దీని ఫలితాన్ని వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రామాల్లోని పంతాలు, పట్టింపులు ఆసక్తి కరంగా ఉంటాయి. దాదాపు 50 ఏళ్ల నుంచి ప్రతీ ఊరిలోనూ రెండు వర్గాలు రాజకీయాలు చేయటం జరుగుతూ వస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ లుగా చీలిపోయి రాజకీయం నడిచేది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఏ పార్టీ వైపు ఉన్నప్పటికీ, రెండు గ్రూపులకు క్యాడర్ మాత్రం నిలిచి ఉండేది. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తే, అది పూర్తిగా తెలుగుదేశం వైపు వస్తుందని చంద్రబాబు నమ్మారు కానీ, తెలుగుదేశం వ్యతిరేక క్యాడర్ కాస్తా కాంగ్రెస్ నుంచి వైసీపీ కి బదలీ అయిపోయింది. దీంతో 2014 లో అధికారం దక్కింది కానీ, బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఆవిర్భవించింది. 2019 లో అధికారం దక్కించుకొనేందుకు ఈ క్యాడరే వైసీపీ కి అండగా నిలిచింది.
2019 24 మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, ఆఖరికి క్యాడర్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. ఐఎఎస్ లు, కొందరు సలహాదారుల మధ్యలో కూరుకొని పోయి పరిపాలన చేసిన పాపానికి ఎన్నికల్లో భారీ శిక్ష పడింది. గ్రామాల్లోని క్యాడర్ పూర్తిగా నిస్తేజం అయిపోయింది. ఇటువంటప్పుడు అయినా క్యాడర్ ను కూడగట్టుకోవటం మానేసిన వైయస్ జగన్ , మరోసారి ఇంటికి పరిమితం అవుతూ రాజకీయాలు నడుపుతున్నారు. ఫలితంగా గ్రామాల్లోని వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఆలోచనలో పడుతోంది.
ఈ సమయంలో వైసీపీ వెన్నుముక విరిచేందుకు తెలుగుదేశం పార్టీ తెలివిగా వైయస్ షర్మిలను ముందుకు నడిపిస్తున్నారు. వైసీపీ కి మూలస్తంభం అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డిని దేవుడిని చేసేస్తున్నారు. తెలుగుదేశం వ్యతిరేక క్యాడర్ ను నెమ్మదిగా వైసీపీ నుంచి విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ అన్నా, వైయస్ జగన్ అన్నా ఒక అంటుకోరాని వస్తువుగా మార్చేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని క్యాడర్ లో గందరగోళం సృష్టిస్తున్నారు. చాప కింద నీరులా వైసీపీ క్యాడర్ ను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరో వైపు వైసీపీ కి మొదట నుంచి అండగా నిలిచేది సోషల్ మీడియా సైన్యం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ సైన్యం మీద వేట మొదలు పెట్టేసింది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో తెలుగుదేశాన్ని, ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేసే వైసీపీ కార్యకర్తలను పోలీసలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీనికి ముందుగా వైయస్ షర్మిల చేత కొన్ని ప్రకటనలు ఇప్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద, వైయస్ విజయమ్మ మీద, వైయస్ షర్మిల మీద ఈ కార్యకర్తలు ట్రోల్ చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే పోలీసు దాడులు మొదలు అయిపోయాయి. దీంతో ఈ సోషల్ మీడియా కార్యకర్తలకు సానుభూతి దొరక కుండా చేసేశారు. పనిలో పనిగా బెయిల్ కూడా దొరక్కుండా కేసులు తిరగతోడుతున్నారు.
అంతిమంగా గ్రామాల్లోని వైసీపీ మూలాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేందుకు తెలుగుదేశం పార్టీ పథక రచన చేస్తోంది. అంత మాత్రాన ఇప్పటికి ఇప్పుడు వైసీపీ పార్టీ మొత్తం బ్యాగ్ సర్దేస్తుంది అని చెప్పలేం కానీ, టీడీపీ వైపు నుంచి బలమైన ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి.