తెలుగుదేశం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చాలా పట్టుదలగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిన ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద టార్గెట్ పెట్టుకొన్నారు. అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు మీద కోపంతో ఉన్నారు. ఎలాగైనా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని పంతం పట్టారు.
ఇప్పటికే ఈ ఇద్దరి మీద పోలీసు కేసు పెట్టించారు.
ఆ ఇద్దరు తో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతటితో ఆగకుండా ఈ విషయమై రాష్ర ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని ఆయన వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నవిధంగా తనపై హత్యాప్రయత్నం చేసినట్లు ఆరోపిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో విద్వేష వ్యాఖ్యల కేసులో తనను అరెస్టు చేసి కస్టడీలో హింసించిన అధికారులపై చర్యలకు ఆయన పట్టుబడుతున్నారు.
దీనిపై చర్యలు కోరుతూ గురువారం గుంటూరు ఎస్పీ కార్యాలయానికి రఘురామ వెళ్లారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎస్పి సతీష్కుమార్ని కలిసి తన కేసు పూర్వపరాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్రపన్నారని, మీడియా వల్లనే తాను బతికిపోయినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డిజి సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకోవటానికి వచ్చానని చెప్పారు.తన దగ్గర ఉన్న సమాచారం పోలీసు అధికారులకు ఇచ్చేందుకు వచ్చినట్లు రఘురామ తెలిపారు. తొలుత పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించాలని కోరారు.
మొత్తం మీద త్వరలోనే ఈ పోలీసు అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసేందుకు ఈ ఇద్దరు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు దగ్గరకు కూడా రానీయలేదు. దీంతో రాజు గారి విన్నపం మేరకు సస్పెన్షన్ పడుతుందని భావిస్తున్నారు.