తెలంగాణను 10 సంవత్సరాల పాటు పరిపాలించిన కేసీఆర్ కు చుక్కలు చూపించేందుకు చంద్రబాబు మార్కు ప్రణాళిక అమలవుతోంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా శిథిలం చేసేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బాగం గానే గులాబీ నేతలతో విడివిడిగా మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గులాబీ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకోవడంతోపాటుగా పట్టణస్థాయి మండల స్థాయి నేతలను పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి తెచ్చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ కొన్నిచోట్ల అప్పటికే పాతుకుపోయిన కాంగ్రెస్ నేతలు వలస నాయకుల్ని అడ్డుకుంటున్నారు. దీంతో గులాబీ పార్టీ నుంచి చేరికలు కొంత ఇబ్బంది అవుతుంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తెలుగుదేశం పార్టీని యాక్టివేట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్న నియోజకవర్గాలలో,, గులాబీ పార్టీ అసమ్మతి నేతలను తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి పంపించబోతున్నారు.
తెలంగాణ రాజకీయాల వరకు రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు ఒక అండర్ స్టాండింగ్ లో వెళ్తుంటారని ఇప్పటికే పబ్లిక్ లో టాక్ ఉంది. ఆకస్మాత్తుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. 2013-15 మధ్యకాలంలో తెలుగుదేశం నుంచి చాలామంది నాయకులు గులాబీ పార్టీలో చేరిపోయారు. అప్పట్లో కెసిఆర్ చాలా క్లోజ్ గా ఉండడంతో ఈ నాయకులందరూ ధీమాగా గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ రెండోసారి ముఖ్యమంత్రి అప్పటినుంచి కెసిఆర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని సీనియర్ల కంప్లైంట్. పాత తరం నాయకుల్ని పార్టీలో పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ఇటువంటి అసమ్మతి నాయకులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకులే కావడంతో తేలికగా టిడిపి మెట్లు ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాము టిడిపిలో చేరుతున్నామని స్పష్టంగా ప్రకటించారు. అదే మాదిరిగా గులాబీ పార్టీలో అసమ్మతి నేతలుగా ఉండిపోయిన సీనియర్లు ఇప్పుడు తాజాగా పసుపు కండువా కప్పుకుని అవకాశం కనిపిస్తుంది.
అంతమాత్రాన తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విపరీతంగా పుంజుకుంటుంది అనుకోవడం అత్యాశే. ఆ విషయం మనకన్నా చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఓటుకు నోటు కేసులో ఇరికించి తెలంగాణ నుంచి బలవంతంగా తెలుగుదేశాన్ని బయటకు పంపించేశారు అన్నది పబ్లిక్ టాక్. ఆ కోపాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే మాదిరిగా గులాబీ పార్టీని నామరూపాలు లేకుండా చేసేయాలి అన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి కూడా ఈ స్కెచ్ కు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది.
మొత్తం మీద చంద్రబాబు రేవంత్ రెడ్డి అండర్ స్టాండింగ్ తో నడిపిస్తున్న ఈ స్కెచ్ తో గులాబీ పార్టీకి చాలా డామేజ్ కలుగుతుందన్నది సు స్పష్టం.