ఆఫ్గనిస్తాన్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో ఎడ్యుకేషన్ విధానానికి ముగింపు పలకాలని తాలిబన్లుల ఆదేశించారు. హెరత్ ప్రావియన్స్‌లో తాలిబన్ అధికారులు ఈమేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఒకే క్లాసులో విద్యార్ధులతో కలిసి విద్యార్ధినులు కూర్చునేందుకు అనుమతించరాదని తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. యూనివర్సిటీ లెక్చరర్లు, ప్రైవేట్ విద్యాసంస్ధల యజమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కో ఎడ్యుకేషన్‌ను అనుమతించరాదని ఈ విధానాన్ని నిలిపివేయాలని తాలిబన్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ యూనివర్సిటీలు, విద్యా సంస్ధల్లో విద్యార్ధినీ, విద్యార్ధులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని, అయితే ప్రైవేట్ విద్యాసంస్ధల్లో విద్యార్ధినుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం ఆయా సంస్ధలకు భారమవుతుందని యాజమాన్యాలు అధికారులకు తెలిపినట్టు తెలిసింది. సమాజంలో అన్ని అనర్ధాలకు కో ఎడ్యుకేషనే కారణమని…దాన్ని రద్దు చేయాలని ఆప్ఘనిస్ధాన్ ఇస్లామిక్ ఎమిరేట్, ఉన్నత విద్య చీఫ్ ముల్లా ఫరీద్ స్పష్టం చేశారు. విద్యార్ధినులకు మహిళా లెక్చరర్లు, వయసు మీరిన లెక్చరర్లతో బోధన సాగించాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించే పరిస్థితులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో లేనందును చాలామంది బాలికలు, యువతులు ఉన్నత విద్యకు దూరమవుతారని లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.