స్వదేశీ రక్షా బంధన్.. ఇదే నేటి నినాదం..
– ఆకారపు కేశవ రాజు,
– క్షేత్ర సంఘటన మంత్రి,
– పరిషత్, దక్షిణ భారత దేశం
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో బెంగాల్ మాత్రమే కాదు, దేశపు నలుమూలలా దేశభక్తి గల పౌరులు ఏకమైయ్యారు దీనితో బ్రిటీష్ ఆక్రమణకారులు తలవంచవలసి వచ్చింది. ఈ పోరాట విజయమే 1947 స్వాతంత్ర్యానికి నాంది.
ఆ రోజుల్లో హిందువులతో పాటు దేశంలోని కొందరు ముస్లింలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బ్రిటీష్ పాలకులు మొదటి నుంచి ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని అనుసరించే వారు. మన మధ్య విభజన జరిగితే భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించడం సులువవుతుందని భావించేవారు. అందువల్ల, ప్రయోగాత్మకంగా బెంగాల్‌లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని అస్సాంలో విలీనం చేయడం ద్వారా కొత్త ప్రావిన్స్‌ను ( కొత్త రాష్ట్రం) సృష్టించడానికి కుట్ర పన్నారు . లార్డ్ కర్జన్ వైలీ అప్పటి వైస్రాయ్. మనదేశ వేసవి రాజధాని సిమ్లాలోని ‘వైస్రాయ్ భవన్’ నుండి ఈ రాష్ట్రం అక్టోబర్ 16, 1905న ఉనికిలోకి వస్తుందని ఉత్తర్వు జారీ చే
శారు.
అక్టోబర్ 16 చరిత్రలో స్వదేశీ భావన పెల్లుబికిన రోజు:
ఇది విన్న బెంగాల్ మొత్తం ఉలిక్కిపడింది. దీనికి నిరసనగా రాజకీయ నాయకులే కాకుండా చిన్నారులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ వీధుల్లోకి వచ్చారు. ఆ రోజుల్లో బెంగాల్ విప్లవకారుల కోట. ఈ అసహజ విభజనను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వబోమని హెచ్చరించారు. న్యూస్ మీడియా వారు కూడా వెనుకంజ వేయలేదు. దీనిపై ప్రత్యేక కథనాలు ప్రచురించారు. దీనితో విభజన విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. విదేశీ వస్త్రాలు, వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ వస్త్రాలను వస్తువులను మాత్రమే వాడాలని స్వదేశీయ పద్ధతిలో జీవించాలని జాతీయ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభల్లో ఈ విషయమే ప్రత్యేకంగా చర్చిస్తుండేవారు. ప్రజలు జరుపుకునే అన్ని పండుగలను కుటుంబ వేడుకలను ఏడాదిపాటు వాయిదా వేసి జాతీయ సంతాప దినాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తులు విస్తృత ప్రభావం చూపాయి. వేద పండితులు విదేశీ దుస్తులు ధరించిన వధూవరుల వివాహాలను నిర్వహించబోమని ప్రకటించారు. నాయి బ్రాహ్మణులు (బార్బర్లు) విదేశీ వస్తువులను ఇష్టపడేవారి జుట్టును కత్తిరించడానికి నిరాకరించారు, మరియు చాకలివారు వారి బట్టలుతకడానికి నిరాకరించారు. ఇలా అన్ని రకాల సేవలు అందించే వారందరూ విదేశీ వస్తు బహిష్కరణ జరిపారు. దీనితో విదేశీ వస్తువుల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఎవరైనా విదేశీ వస్తువులను వాడితే వారిని చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే మీ వస్తువులను ఇక్కడ విక్రయించడం అసాధ్యంగా మారుతుందని ‘మార్వారీ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ‘మాంచెస్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’కి టెలిగ్రామ్ పంపింది.
1905 అక్టోబరు 16న విభజన ప్రణాళిక అమలు దినాన్ని బెంగాల్ అంతటా సంతాప దినంగా జరుపుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇతర ప్రముఖులు ఈ రోజున పౌరులందరూ గంగానది లేదా సమీపంలోని ఏదైనా నదిలోనైనా స్నానంచేసి ఒకరి చేతులకు మరొకరు రాఖీ కట్టుకోవాలని కోరారు. ఈ ప్రజా వ్యతిరేక బ్లాక్ ఆర్డర్ ఉపసంహరించుకునేంత వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేయాలన్నారు.
అక్టోబర్ 16న బెంగాల్ ప్రజలంతా తెల్లవారుజామున వీధుల్లోకి వచ్చారు. వారు ఉదయం ఊరేగింపులు జరిపారు మరియు భజనలు కీర్తనలు ఆలపిస్తూ వెళ్లారు. స్నానమాచరించి అందరూ ఒకరికొకరు పసుపు నూలుతో రాఖీ కట్టుకొని “వందేమాతరం” ఉద్యమ మంత్రాన్ని ఆలపించారు… దేశంలోని ప్రజలందరూ వందేమాతరం ఆలాపించిన కారణంగా ఆ ఉద్యమానికే వందేమాతరం ఉద్యమమని పేరొచ్చింది ఇక మహిళలు “బంగాలక్ష్మి” వ్రతాన్ని ఆచరించారు…. ఇలా ప్రజల స్వదేశీ ఆచారాలు స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదాయి.
ఆరేళ్లపాటు కొనసాగిన ఉద్యమంలో వేలాదిగా ప్రజలు జైల్లకు వెళ్లారేగానీ వెనక్కి తగ్గలేదు. లాల్, బాల్, పాల్ (లాలా లజపతిరాయ్ లాహోర్ ప్రస్తుత పాకిస్తాన్ కేంద్రంగా, బాలగంగాధర్ తిలక్ పూనా మహారాష్ట్ర, బిపిన్ చంద్రపాల్ బెంగాల్.) త్రయం దేశం మొత్తం ఈ మంటను రాజేసింది. ఈ ఉద్యమాన్ని చూసి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యమే గడగడలాడిపోయింది. “స్వాతంత్ర్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను” అని ప్రకటించిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్… వారి పిలుపుతో లక్షలాదిమంది ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించారు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. ఇవన్నీ గమనించిన ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ బ్రిటిష్ పాత్రికేయుడు. వాలెంటైన్ చిరోల్ బాల్ గంగాధర్ తిలక్ కు “భారతదేశ అశాంతి పితామహుడు” అనే బిరుదు ఇచ్చారు.
దీంతో లండన్‌లో కూర్చున్న బ్రిటిష్ పాలకులు తెల్లవాడికి చెమటలు పట్టాయి.. తమ భవిష్యత్తు గురించి భయాందోళనకు గురయ్యారు. తమ వలసరాజ్యాల పైన పట్టు చేయి జారిపోతుందేమోనని, బ్రిటీష్ చక్రవర్తి జార్జ్ V డిసెంబర్ 11, 1912న ఢిల్లీకి స్వయంగా వచ్చిన కోర్టునేర్పాటు చేసి దానిద్వారా ఈ ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా వైస్రాయ్ లార్డ్ కర్జన్‌ను ఇంగ్లాండ్ పంపించి అతని స్థానంలో లార్డ్ హార్డింగ్‌ను భారతదేశానికి పంపాడు. అలా “స్వదేశీ ఉద్యమం ద్వారా – రాఖీ నూలు దారాల ద్వారా ఏర్పడిన ఐక్యత వందేమాతరం ఉద్యమాన్ని విజయవంతం చేసింది”.
వందేమాతరం ఉద్యమం నాటి స్వదేశీ సంకల్ప స్ఫూర్తి ఈరోజున మళ్లీ దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్లో పాదుకొల్పవలసిన సమయం ఆసన్నమైంది.
భారత ప్రజలు తమ జీవితంలో అనేక రంగాలలో ‘స్వ’త్వం కోల్పోతున్నారు భారతీయతను కోల్పోతున్నారు. విదేశీభాష మోజులో మాతృభాషను కోల్పోయి తద్వారా మాతృసంస్కృతిని కూడా దూరం చేసుకుని మన ఆచారాలు అలవాట్లను విడనాడుతున్నాము. ఫలితంగా అవసరం లేకున్నా 40డిగ్రీల పైన వేడి ఉండే హైదరాబాదు లాంటి నగరాల్లో కూడా సూటు బూటు వేసుకొని టై కట్టుకొని చెమటకంపుతో బాధపడుతున్ననట్లుగా మన దేశ వాతావరణము పరిస్థితులకు అనుకూలమైన అవసరమైన అనేక అంశాలను తెలిసో తెలియకో దూరం చేసుకుని పాటించక పోవడంతో తల్లడిల్లి పోతున్నాము. కొందరు బతుకు బండి లాగడానికో లేదా విదేశీ మోహంతోనో పిల్లలను విదేశాలకు పంపి పెద్దలు ఇక్కడ ఒంటరిగా ఉన్న ఫలితంగా ఆలనాపాలనా చూసేవారు లేక మంచినీళ్లు ఇచ్చేవారు కాదు కదా పలకరించే వాళ్లు కూడా లేక దిక్కు లేని అనాధలవుతున్నారు, పిల్లలే వద్దనుకున్న కొన్ని జంటలు కూడా కనబడుతున్నాయి. జనాభా సమతుల్యతకు కనీసపు జననాల రేటు 2.5 ( రెండు జంటలకు కనీసం ఐదుగురు పిల్లలు) ఉండవలసింది ఈ సంవత్సరం నాటికి 1.5 గా( రెండు జంటలకు ముగ్గురు పిల్లలు) మాత్రమే మారిందని లెక్కలు తెలియజేస్తున్నాయి. జనాభా సంఖ్య పెంచడం వలన వచ్చే ఇబ్బందులు ఒక ఎత్తైతే జనసంఖ్య తగ్గిన కారణంగా కూడా ఎంతటి విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందో జపాన్ ను, చైనాను చూసి నేర్చుకోవాలి. సామూహిక కుటుంబ జీవనపు ఆనందమును కోల్పోయి వీరి బ్రతుకులు నాశనం అవుతున్నాయు. ఇటువంటి జీవితాలన్ని ఆనందమయంగా మార్చుకోవాలి కదా.
ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారతీయ స్వదేశీ తత్వాన్ని మరిచిపోయి, తెచ్చి పెట్టుకున్న గొప్పతనంతో ఆహారము మంచినీళ్లు నుండి అనేక వస్తువులను అవసరానికి మించి సమకూర్చుకొని ఎంత వృధా చేస్తున్నామో తెలియకుండానే చాలామందికి అలవాటయింది. ఈ కారణంగా ఎంతో మందికి కనీస అవసరాలు కూడా తీరక బాధపడుతున్నారు. ఇక మనం వాడే వస్తువులను ఉదాహరణకు ప్లాస్టిక్, కెమికల్ సబ్బులు, రసాయనాలు ఉపయోగించిన క్లీనింగ్ సామాగ్రి, చివరికి ఏ.సీ.లు కూడా ఇతరులకు, ప్రకృతికి కూడా కీడుగా మారుతున్న పరిస్థితి కూడా దాపురించింది మన తత్వానికి వ్యతిరేకంగా మరింత కావాలి మరింత కావాలి అనే తాపత్రయంతో హైబ్రిడ్ విత్తనాలను హైబ్రిడ్ జంతువులను పెంచి ప్రకృతికి ఎంత చేటు చేస్తున్నామో…ఇది మారాలి.
ప్రకృతి రక్షణ – సామాజిక సమరసత:
ఏ అవసరానికో ఒక్క చెట్టు కొట్టాలంటే పది చెట్లను నాటాలని, ఏ పండుగో, వ్రతమో, పూజనో చేసుకోవాలనుకున్నా అది వ్యక్తిగతమైనదైనా పదిమందిని పిలిచి భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చి వాయనాలు ఇవ్వమని చెప్పిన విషయం, పదిమంది చదువు కోసం పదుగురి దాహం తీర్చడం కోసం ప్రతి గృహస్తు ఆలోచించాలి, వివాహము నుండి చావు పుట్టుకల వరకు ప్రతి సందర్భంలోనూ సమాజంలోని ప్రతి కులము యొక్క సహకారంతోనే నిర్వహించుకుంటాము. ఉదాహరణకు వివాహంలో గంధము యజ్ఞోపవీతం, కొత్త బట్టలు పద్మశాలీల నుండి, పెళ్లి కుండలు కుమ్మరి నుండి, పెళ్లికి కొత్తచెప్పులు, ఇంటి ముందు పందిళ్లు మంగళ వాయిద్యాలు ఇక వివాహంలో చాకలి మంగలి ఇలా అన్ని కులాల వారిని ఆహ్వానించి వారు చేసే సేవలకు ప్రతిఫలంగా మనం వారికి డబ్బులు ఇవ్వము వారిని గౌరవించేందుకు కొత్త బట్టలు పెట్టి సన్మానించి కట్నం పెడతాము ఇలా మన పూర్వీకులు ఏర్పాటుచేసిన సామాజిక సమరసతా విధానాన్ని 100కు 100% అనుసరించాలి. సంపాదించిన ధనం తనకు తన కుటుంబానికి మాత్రమే కాదు తన గ్రామానికి మన దేశానికి చివరికి ప్రకృతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అనేక నిర్మాణాలు, దానాలు, యజ్ఞాలు చేయాలని చెప్పిన స్వదేశీయ సాహిత్యంలోని వేదాలు, పురాణాలు, ఇతిహాసాల కథనం.
ఇవి చెప్పిన బాధ్యతలను మరిచి హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల నుండి సాధారణ వ్యక్తి వరకు తన కోసం మాత్రమే ఆలోచిస్తూ సమాజం కోసం ఏమి ఇవ్వకుండా పైపెచ్చు సమాజం యొక్క సామూహిక సంపద నుండి దోచుకోవడం, అది తమ గొప్పతనంగా చెప్పుకోనే పరిస్థితి నెలకొనడం బాధాకరం దీనిని సరిచేసి వ్యక్తి నియమాలను పాటించేటట్లుగా చూసుకోవడం కూడా అత్యవసరం.
“స్వదేశీ నినాదం కాదు – నిబద్ధతతో కూడిన జీవన విధానం” : పరతంత్రం లో జీవించడం కన్నా పాపం మరొకటి లేదు. ఏ దేశం నుండైనా ప్రజలకు మేలు చేసే ఏ కొత్త విషయం వచ్చినప్పటికీ దానిని మన దేశ అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుని ఉపయోగించుకోవాలి. అందుకే స్వదేశభక్తి తో ‘స్వ’త్వం కలిగిన వ్యక్తులు స్వభాష స్వవేషం, స్వభూష, స్వధర్మనిష్టలను పాటించినవారు తాము ఆనందంగా జీవించగలుగుతారు, పదుగురికి ఆనందాన్ని పంచుతారు, ప్రకృతిని రక్షించుతారు.
(అక్టోబర్ 23 నుండి 27 వరకు హైదరాబాదులో స్వదేశీమేళ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని.)