రామసేతును ‘జాతీయ వారసత్వ స్మారక చిహ్నం’గా ప్రకటించమని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. ఈ పిటిషన్ ను ఇదివరకే జూలై 26న విచారణకు లిస్ట్ చేయడానికి అంగీకరించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం.. సంబంధిత బెంచ్ లోని ఒక న్యాయమూర్తికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నందున అలా చేయలేమని గతంలో పేర్కొంది. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ కేసును అర్జెంటుగా లిస్ట్ చేయమని కోరిన సుబ్రమణ్యస్వామి.. జులై 13న కూడా ఎస్సీ ని కోరారు.
రామసేతును ‘ఆడమ్స్ బ్రిడ్జి’ అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో ఉన్న పాంబన్ ద్వీపం, శ్రీలంక వాయువ్య తీరంలో ఉన్న మన్నార్ ద్వీపం మధ్య ఉంటుంది.
రామసేతు ఉనికిని కేంద్రం అంగీకరించిన మొదటి రౌండ్ వ్యాజ్యంలో తాను ఇప్పటికే గెలిచానని స్వామి కోర్టుకు సమర్పించారు. తన డిమాండ్ ను పరిశీలించేందుకు సంబంధిత కేంద్ర మంత్రి 2017లో సమావేశాన్ని ఏర్పాటు చేశారని.. అయితే ఆ తర్వాత ఏమీ జరగలేదన్నారు. యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వివాదాస్పద సేతుసముద్రం షిప్ ఛానల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్వామి రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలనే అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయం 2007లో సుప్రీంకోర్టుకు చేరింది, రామసేతుపై ప్రాజెక్ట్ పనులపై స్టే విధించింది.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సామాజిక-ఆర్థిక ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకున్నామని.. రామసేతుకు నష్టం జరగకుండా షిప్పింగ్ ఛానల్ ప్రాజెక్ట్ కు మరొక మార్గాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. దీంతో కోర్టు తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 2019, నవంబర్ 13న రామసేతుపై తన వైఖరిని స్పష్టం చేయడానికి సుప్రీంకోర్టు కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. కేంద్రం నుంచి స్పందన రాకపోతే కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కూడా స్వామికి ఇచ్చింది.