జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్‌పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. మసీదులో శివలింగం కనిపించిందన్న వార్తల మధ్య హిందూ సంఘాలు మసీదు లోపల పూజలు చేసే హక్కును కోరాయి.
దేశంలో సమతుల్యతను కాపాడే స్థానంలో మేం ఉన్నామని పేర్కొంటూ, శివలింగం ఉన్న ప్రదేశాన్ని రక్షించడానికి మే 17 నాటి ఉత్తర్వు కొనసాగుతుందని.. ముస్లింలు మసీదు లోపల కాళ్ళు, చేతులు కడుక్కోవడం కోసం ఏర్పాటు చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుభవజ్ఞుడైన న్యాయాధికారి విచారణ జరిపితే బాగుంటుందని తెలిపింది. ఈ కేసుకు సంబందించిన కొన్ని వీడియోలను బయటకు రాకుండా ఆపాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్, “మేం దేశ సమతుల్యతను కాపాడే జాయింట్ మిషన్‌లో ఉన్నామని దయచేసి మర్చిపోవద్దు” అని అన్నారు.
‘ఈ అంశం సంక్లిష్టత, సున్నితత్వాన్నిదృష్టిలో ఉంచుకుని.. వారణాసిలోని సివిల్ జడ్జి సమక్షంలో విచారణలో ఉన్న సివిల్ దావాను ఉత్తర ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్‌లోని సీనియర్, అనుభవజ్ఞుడైన జ్యుడిషియల్ ఆఫీసర్ వింటే బాగుంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే గతంలో ఆదేశాలు ఇచ్చిన సివిల్ జడ్జిపై తన ఆదేశాల ప్రభావం ఏమీ ఉండదని స్పష్టం చేసింది.
ఈ కేసులో తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.