పార్టీ తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు మద్రాస్ హైకోర్టుకు అప్పగించింది. విచారణ జరిపి మూడు వారాల్లోగా తీర్పు చెప్పాలంది. అప్పటివరకు పార్టీలో యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
జూలై 11న ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ద్వంద్వ నాయకత్వం విధానానికి ముగింపు పలకాలని నిర్ణయించారు. పళనిస్వామిని పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించింది. పన్నీర్‌సెల్వం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ని బహిష్కరించింది. దీంతో పళనిస్వామి ఆ పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదే రోజు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం వర్గం…పార్టీకి సంబంధించిన విలువైన పత్రాలను దొంగిలించిందని పళనిస్వామి వర్గం ఆరోపించింది. చెన్నై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అటు పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు పన్నీర్ సెల్వం.