సంచలనం సృష్టించిన కోల్ కతాలోని ట్రైనీ డాక్టర్ అత్యాచారం సంఘటన మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు భద్రత లేని పరిస్థితి సమాజానికి మంచిది కానేకాదు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటువంటి దుశ్చర్యలు మరోసారి చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు అవసరం అని అభిప్రాయపడింది. వైద్యుల భద్రత కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియామకం చేసింది ఇందులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు డాక్టర్లకు స్థానం దక్కింది.
కోల్్ కతా ఆస్పత్రిలో డాక్టర్ మీద హత్యాచారం ఘటన మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి , ఆ బృందంలోని సభ్యుల పేర్లను కూడా సుప్రీం వెల్లడించింది.
జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం జాబితా: సర్జర్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్, డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్ , డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్ పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా(ఎయిమ్స్ కార్డియాలజిస్ట్), ప్రొఫెసర్ పల్లవి సప్రే(ముంబై గ్రాంట్ కాలేజీ డీన్), డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్(ఎయిమ్స్ న్యూరాలజీ) ఉన్నారు. ఇందులో ఇద్దరు తెలుగు డాక్టర్లు ఉన్నారు.
ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక రాగల కాలంలో కీలకంగా కానుంది.
ఈ డాక్టర్లు తో పాటు భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ మెడికల్ కమీషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఆ జాబితాలో ఉన్నారు. జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. లింగ ఆధారిత నేరాలను అరికట్టేందుకు ప్రణాళికలు , ఇంటెర్నీలు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్ డాక్టర్ల భద్రత కోసం జాతీయ ప్రణాళికలను టాస్క్ ఫోర్స్ సభ్యులు రూపొందించాల్సి ఉంటుంది.
ఇప్పటికే డాక్టర్ల భద్రతకు సంబంధించి కొన్ని సూచనలు అందుతున్నాయి. ఎమర్జెన్సీ రూంల వద్ద అదనపు భద్రతను పెంచడం, ఆస్పత్రుల వద్ద బ్యాగేజీ స్క్రీనింగ్ పెంచడం, పేషెంట్లు కాని వారు ఓ పరిధి దాటి లోపలికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో జనాన్ని అదుపు చేసేందుకు భద్రత కావాలి, డాక్టర్లకు రెస్టు రూమ్‌లు కావాలి. అన్ని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలి. సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. మెడికల్ ప్రొఫెషనల్స్‌ను తరలిచేందుకు రాత్రి పది నుంచి ఆరు వరకు ట్రాన్స్‌పోర్టు చేయాలి. ఎమర్జెన్సీ వేళ మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలి అని మార్గదర్శకాల్లో సూచించారు.
మెడికల్ ప్రొఫెషనల్స్‌కు సంస్థాగత భద్రత అవసరమని విచారణ సందర్భంగా సీజేఐ తెలిపారు. 36 గంటల పాటు విధుల్లో ఉండే డాక్టర్లు, ఇంటెర్నీలు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్ డాక్టర్లకు రెస్టు రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
దేశ ప్రయోజనాలు, సమానత్వ కోసం మహిళా డాక్టర్లకు భద్రత కల్పించాలని సీజేఐ స్పష్టం చేశారు.
భారత ప్రధాన న్యాయ న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది. కోల్ కతా హైకోర్టు సూచన మేరకు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుని సిబిఐ చేపట్టింది. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించవచ్చు