ముస్లింల పేరిట మహిళలకు కనీస హక్కులు లేకుండా చేసిన దుస్థితి మరోసారి బయటపడింది. విడాకులు తీసుకున్నప్పుడు భర్త నుంచి భరణం పొందే హక్కు కూడా ముస్లిం మహిళలకు లేదని ఆ మత పెద్దలు వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ వాదనన్ని తోసి పుచ్చింది. కష్టంలో ఉన్న మహిళలు ఎవరైనా మతంతో సంబంధం లేకుండా భరణం అడగవచ్చు అని చారిత్రక తీర్పు ఇచ్చింది.
తెలంగాణకు చెందిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. భరణం అనేది దానం కాదనీ, వివాహిత మహిళల ప్రాథమిక హక్కు అనీ కోర్టు స్పష్టం చేసింది. ఆ హక్కుకు మతంతో సంబంధం లేదు. అది లింగ సమానత్వానికి నిదర్శనం, వివాహిత మహిళల ఆర్థిక భద్రతకు భరోసా అని అభిప్రాయపడింది. ‘‘గృహిణి అయిన భార్య తన భర్తపై భావోద్వేగపరంగానూ, ఇతరత్రానూ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని కొందరు భర్తలు తెలుసుకోవడం లేదు. గృహిణిగా భార్య నిర్వర్తించే విధులు, వారు కుటుంబం కోసం చేసే త్యాగాలను భారతీయ పురుషులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వ్యాఖ్యానించింది.
అసలు ఈ కేసు మూలాలు ఒకసారి చూడాల్సి ఉంది.
తెలంగాణకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం తన భార్యకు విడాకులిచ్చాడు. ఆ సందర్భంగా ఒక ఫ్యామిలీ కోర్టు అతన్ని తన భార్యకు నెలకు రూ.20వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. సమద్ ఆ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసాడు. హైకోర్టు భరణం మొత్తాన్ని రూ.10వేలకు తగ్గించింది. అయితే భరణం ఇవ్వడం అసలు ఏమాత్రం ఇష్టం లేని సమద్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు. విడాకులైన ముస్లిం మహిళ 1986 నాటి ముస్లిం మహిళలు (విడాకుల హక్కుల రక్షణ) చట్టం ప్రకారం సహాయం కోరవచ్చుననీ, అంతేతప్ప క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 వర్తించదనీ సమద్ తరఫు న్యాయవాది వాదించాడు. ప్రత్యేక చట్టాలు ఉన్నప్పుడు సాధారణ చట్టం కంటె వాటినే ఆశ్రయించాలని వాదించాడు. అయితే సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ఆ వాదనతో విభేదించారు.
లింగసమానత్వం పాటించే సీఆర్పీసీ కింద మహిళలకు లభించే ఊరటను వ్యక్తిగత చట్టాలు తీసివేయలేవని స్పష్టం చేసారు. ఈ తీర్పు విశిష్టత అర్ధం చేసుకోడానికి 1985 నాటి షాబానో కేసును ఒకసారి తరచి చూడాలి. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ సిఆర్పిసి సెక్షన్ 125 వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తీర్పును పలచన చేయడానికి ప్రత్యేకంగా ముస్లిం మహిళలు (విడాకుల హక్కుల రక్షణ) చట్టం పేరుతో 1986లో చట్టం చేసారు. దాని ప్రకారం ముస్లింమహిళలు ఇద్దత్ వ్యవధిలోనే, అంటే విడాకులైన 90 రోజుల లోపలే భరణం గురించి అడగగలరు. ఆ ఇద్దత్ కాలం దాటిపోతే వారికి భరణం చెల్లించనక్కరలేదు. 1986 నాటి ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటవుతుంది అని సుప్రీంకోర్టు 2001లో స్పష్టం చేసింది. అయితే సదరు విడాకులు పొందిన మహిళ ఆర్థిక స్వావలంబన పొందేవరకూ లేదా మరో పెళ్ళి చేసుకునే వరకూ భరణం చెల్లించాల్సిన బాధ్యత పురుషుడిపై ఉంటుందని చెప్పింది.
స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే ముస్లిం మహిళకు కనీస హక్కులకు కనీస హక్కులు కలుగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ తలాక్ రద్దు ఒక చారిత్రక అంశం అయితే,, సుప్రీం కోర్టు తాజా తీర్పు మరొక ముఖ్యమైన ఘట్టం.