అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొన్న వ్యోమగాములు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. మనో ధైర్యం కోల్పోకుండా, అంతరిక్షంలో ఉండేందుకు సునీత విలియమ్స్ .. తన వెంట భగవద్గీత ను ఉంచుకొన్నారు. నిరాశ సమయంలో తనకు గీత ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆమె పదే పదే చెప్పేవారు.
భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ రాక మీద మన దేశంలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇక, గుజరాత్‌లోని పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆమె త్వరలోనే భారత్‌కు వస్తుందని తెలిపారు. “సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం” అని ఆమె బంధువు పాల్గుణి సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమ్మీదకు తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై యావత్ ప్రపంచం స్వాగతం పలుకుతోంది. ఈ సందర్భంగా భారత్‌లో రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, ఇస్రో వ్యోమగాములకు స్వాగతం చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు. ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఈనెల ఒకటో తేదీన రాసిన లేఖను నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా ఆయన పంపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంగళవారం వెల్లడించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, తమ మనసులకు ఆమె చాలా దగ్గరగా ఉన్నట్లు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
దీనిని బట్టి త్వరలోనే సునీత విలియమ్స్ భారత్ లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.