కశ్మీర్ సరిహద్దు కుప్వారాలో భయంకర మంచు తుపాను మధ్య ఆర్మీ జవాను నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. మన రక్షణ కోసం సరిహద్దులో కాపు కాస్తున్న ఆ జవానే అసలైన హీరో అంటూ నెటిజన్లు భావోద్వేగంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. చుట్టూ మంచు నిండిపోయి అతనికి మోకాళ్ల లోతువరకు ఉంది. ఒంటి మీద మంచు తుపాను కురుస్తోంది. అయినా కదలకుండా ధైర్యంగా,దృఢంగా నిలబడి ఉన్నాడు ఆ సైనికుడు. కాశ్మీర్లో భీకర మంచు తుపాను మధ్య మోకాళ్ల లోతు మంచులో నిలబడిన ఆర్మీ సిబ్బంది కనిపించారు.
ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది. ఇక హిమాలయ బెల్డులో భారీ హిమపాతం. ఆ హిమపాతంలోనే సరిహద్దులో జవాన్లు కాపలా కాస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో అక్కడ ఇరుక్కున్న పర్యాటకులను రక్షించే పనిలో మరికొందరు జవాన్లు ఉన్నారు. ఆ సందర్భంగా కుప్వారా ఫార్వర్డ్ పోస్ట్ దగ్గర ఓ జవాను మోకాలి లోతు మంచులో నిలబడి పహారా కాస్తున్న వీడియో ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డిఫెన్స్ మినిస్ట్రీ పీఆర్వో ట్విట్టర్లో వీడియోను షేర్ చేశారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం వారు చేస్తున్న కష్టం, త్యాగాలు గుర్తు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా రీట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.
రక్తం గడ్డకట్టే చలిలో వీరులు విధులు నిర్వహిస్తున్నారు. సూపర్ పవర్ అంటే ఇదే. మంచు, వర్షం, తుపాను దేన్నైనా మీరు తట్టుకుంటారు.. అసలు మీరు నిజంగా మానవాతీతులే. మీరిలా దేశసేవలో పనిచేస్తుంటే మేం హాయిగా నిద్రపోతున్నాం అని ఒకరు. మీ ధైర్యానికి మా వందనం, మీరంటే ప్రేమ, గౌరవ భావం పెరుగుతున్నాయి అంటూ మరొకరు.
మీ త్యాగం చాలా గొప్పది. దాన్ని వెలకట్టలేం, పోల్చలేం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అంత దృఢంగా ఉండడం మీకు చెల్లు. ఇదంతా మాకోసమే కదా అని ఇంకొకరు. వీరజవాన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మన భద్రతాదళాలకు వందనం అంటూ ఇంకొందరు. అసలైన సూపర్ హీరోలకు దేశం రుణపడి ఉంటుంది. మేం దేశంలోపల సురక్షితంగా ఉన్నామంటే సరిహద్దులో మీరలా ఉన్నందునే సాధ్యం అని మరికొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు ఆ వీడియోను జతచేస్తూ…
ఇక పోషియాన్ జిల్లాలో ఓ నిండుచూలాలిని సైనికులు ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తూ ఉన్న ఫొటోలు, వీడియో కూడా వైరల్ అవుతున్నాయి. మోకాలిలోతు కూరుకుపోయిన మంచును చీలుస్తూ సైనికులు ఆ నిండు గర్భిణీని మోస్తూ స్ట్రెచర్ పై ఆస్పత్రికి మోసుకెళ్తున్నారు.