జాతీయ భావన, సదాచారంతో విద్యార్థులను తీర్చుదిద్దుతున్న విద్యాసంస్థలు శ్రీసరస్వతీ శిశుమందిరాలు. దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఏటా లక్షలాది విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందిస్తున్నాయి. ఇక హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ శారదాధామంలోని విద్యాపీఠాన్ని స్థాపించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి స్వర్ణోత్సవ వారోత్సవాల్ని ప్రారంభించారు రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి, విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు . వేడుకల్లో భాగంగా శారదా ధామంలో పూజ, హోమం, శ్రీ రామ నవమి కళ్యాణం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విలువలతో కూడిన విద్యను అందించటంలో ముందు వరుసలో ఉంటున్న బండ్లగూడలోని విద్యాపీఠం పాఠశాల ఉందని… ఎందరో మహానుభావుల శ్రమ, మేధస్సులతో వేలాది విద్యార్థులను మేటి పౌరులుగా ఈ పాఠశాలల ద్వారా తీర్చి దిద్దాయని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా పాతిక వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మందికి పైగా అధ్యాపకులు, 35 లక్షలకు పైగా విద్యార్థులను కలిగిన విద్యా భారతి సంస్థకు ఇది అనుబంధం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకోకుండా, లాభాపేక్ష లేకుండా విద్యా రంగంలో శిశుమందిర్ లు సేవలు అందిస్తున్నాయి. దేశ అభ్యున్నతికి వివిధ రంగాల ద్వారా ఉత్తమ సేవలు అందించే పౌరులను శిశుమందిర్ లు తయారు చేస్తున్నాయి. విద్యా రంగంలో ప్రభావవంతమైన ముద్ర వేసే లక్ష్యంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠం పనిచేస్తోందని తెలిపారు. రెండేళ్ల క్రితం విద్యాపీఠం అనుబంధంగా శారదాధామం ప్రాంగణంలో సీబీఎస్ఈ సిలబస్ తో విద్యారణ్య ఇంటర్నేషన్ స్కూల్ ప్రారంభించినట్టు లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇక స్వర్ణోత్సవాల్లో భాగంగా
సెమినార్ లు, శిక్షణ కార్యక్రమాలు, గోష్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్తీలలో శిశు వాటికలు, కోస్తా తీరం, అటవీ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతున్నట్లు వివరించారు.విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాఠ్య ప్రణాళిక తో పాటు సంగీతం, యోగ, క్రీడలు, సంస్క్రతం, సదాచారం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రశైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు బొడ్డు శ్రీనివాస్, రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రంగయ్యాచారి తదితరులు హాజరయ్యారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)