పాపాలను హరించే పాప హరేశ్వరుడు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నెన్నో ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇందులో ముఖ్యమైనదిగా కదిలి పాప హరేశ్వర స్వామి దేవాలయాన్ని చెప్పవచ్చు. నిర్మల్ కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని కదిలి గ్రామంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఈ దేవాలయానికి ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
..
పురాణాల ప్రకారం పరశురాముడు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. స్త్రీ హత్య దోషం పోగొట్టుకునేందుకు 39 సార్లు మట్టితో శివలింగాన్ని ప్రతిష్టించి అర్చించినట్లు తెలుస్తోంది. పరశురాముడి భక్తికి మెచ్చి నందితో సహా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడి పాపాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు . పరశురాముని కోరిక మేరకు పరమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. ఇక్కడకు వచ్చే భక్తుల పాపాలు దోషాలు హరిస్తానని వరం ఇచ్చారు.
అందుచేతనే ఇక్కడ స్వామిని పాప హరేశ్వరుడు అని పిలుస్తారు.
……..
ఈ క్షేత్రాన్ని తెలంగాణ నుంచే కాకుండా కర్నాటక , మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు దర్శిస్తూ ఉంటారు.
ఇక్కడ మహిమాన్వితమైన గుండం దర్శనమిస్తుంది. ఈ గుండంలో స్నానం ఆచరించి ఇక్కడ ఉన్న భారీ వృక్షాన్ని సందర్శిస్తారు. అనంతరం పాప హరేశ్వరుడికి పూజలు చేస్తారు. శ్రావణం కార్తీక మాసాలలో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు.
…..
ఈ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువైయుంది. అన్నపూర్ణ దేవి స్ఫూర్తికి తగినట్లుగా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు .. గుడికి వచ్చిన భక్తులకు లేదు అనకుండా అన్నం పెట్టి పంపిస్తారు.
…..
మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తున్నారు. శివరాత్రి రోజు స్వయం భూ గా వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవడం మంచిది అని చెప్తారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఇక్కడ అభిషేకాలు చేస్తారు . ఇటువంటి క్షేత్రాన్ని దర్శించినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాం.