కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చీలికలు బాగా కనిపిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రదర్శించడంలో కొన్ని పార్టీలు పక్కకు తప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ వ్యూహాలు సక్రమంగా లేవని బహిరంగంగానే చెబుతున్నాయి. దీంతో ఈ కూటమి చీలిపోతుంది అన్న వాదన బలపడుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద పెద్ద పార్టీల నుంచే వ్యతిరేకత వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూటమి నాయకత్వం, సమన్వయం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘నేను ఇండియా కూటమిని ఏర్పాటు చేశాను. నాకు అవకాశమిస్తే దానిని సాఫీగా నడిసిస్తా. అయితే నేను బెంగాల్‌ను వదిలి బయటకు రావాలనుకోవడం లేదు. ఇక్కడ నుంచే కూటమిని నడపగలను’ అని ఆమె చెప్పారు.
ముఖ్యంగా శివసేన (యూబీటీ), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు మమత చేసిన ప్రకటనపై స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి, కూటమిలో నాయకత్వ మార్పు చేపట్టాలన్న సంకేతాలు ఇచ్చాయి.
దానికి తోడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూటమి పరాజయం, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒకే అంశం(అదానీ అవినీతి)పై కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీయడం, అధికార పార్టీ సభను వాయిదా వేయడం తదితర అంశాలు కూటమిలోని మిగతా పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
ఈ సమయంలోనే మమతా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉందని అంటూ పరోక్షంగా రాహుల్ పై విసుర్లు విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని.. అది టీఎంసీ వల్లే సాధ్యం అని మమతా బెనర్జీకి మద్దతు పలికే పార్టీలు, నేతలు చెబుతున్నారు. అందుకే ఇండియా కూటమి చీఫ్‌గా దీదీ పేరును ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇండియా కూటమికి తాను సమర్థవంతంగా నాయకత్వం వహిస్తానని స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడంతో ఇండియా కూటమిలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు దీదీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇండియా కూటమిలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.
మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు అప్పగించేందుకు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్ననట్లు సమాజ్‌వాదీ పార్టీ నేషనల్ ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి టీఎంసీ గట్టి పోటీని ఇస్తోందని.. కమలం పార్టీని నిలువరించడంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు.
దీనికి బలమైన కారణం మరొకటి కూడా కనిపిస్తోంది.
ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామాలు తలనొప్పి కలిగిస్తున్నాయి.