తెలంగాణ అసెంబ్లీ లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రసమయి ప్రశ్నలు అడుగుతుండగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మైక్ కట్ చేసి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. స్పీకర్ ప్రవర్తనపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడదాం అంటే మైక్ ఇవ్వకపోతే ఎలా, సంబంధిత మంత్రి గారిని ప్రశ్నలు అడగటానికి సమయం ఇవ్వకపోతే ప్రశ్నలు ఎందుకు. మంత్రి గారిని ఏం అడిగారు.. ఏం తీసుకువచ్చారు మాకు.. అని నా నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తే ఏమని సమాధానమివ్వాలి అని అన్నారు. ప్రశ్నలే అడగవద్దు అన్నప్పుడు తమకు ప్రశ్నలు ఎందుకు ఇవ్వడం అంటూ అసంతృప్తి వ్యక్తపరిచారు.
రసమయి వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ, ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ.. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో కూర్చుండిపోయారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)