అంతరిక్ష రంగంలో భారత్ దూసుకొని వెళుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా 2040 నాటికి చంద్రుడి మీదకు భారతీయుల టీమ్ ను పంపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి కీలక పురోగతి సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు కూడా రంగం సిద్దం అయింది. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్ ఏర్పడుతుంది. ప్రస్తుతం రెండు దేశాలకు స్పేస్స్టేషన్స్ ఉన్నాయి. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్‌స్టేషన్ ఉన్న మూడోదేశంగా నిలువనున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారత్ స్పేస్ స్టేషన్ కోసం ప్రణాళికలు రూపొందించింది.
ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్‌స్టేషన్ ఉన్నది. దీన్ని నాశా అనేక దేశాల సహకారంతో నిర్మించింది. ప్రస్తుతం చైనా సైతం సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నది. భారత్ సైతం బీఎస్ఏని నిర్మిస్తే మూడోదేశంగా నిలువనున్నది. ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్ సస్టెయినింగ్ టెక్నాలజీస్‌పై అధ్యయనానికి అనుమతి ఇస్తుంది. అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో భారత్ పేరు సైతం చేరనున్నది.
ఈ ప్రాజెక్ట్ లక్ష్యం యువ శాస్త్రవేత్తలను ప్రేరేపించడంతో పాటు అంతరిక్షరంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం అని అనుకోవచ్చు. ఇప్పటికే చంద్రయాన్-1తో చంద్రుడిపై తొలిసారిగా నీటిజాడలను గుర్తించింది. ఆ తర్వాత చంద్రయాన్-3తో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇస్రో నిలిచింది. భారత్ స్పేస్ స్టేషన్ సైతం గర్వకారణంగా నిలువనున్నది. అదే సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ స్థానాన్ని సుస్థిరం చేయనున్నది.
మొత్తం మీద సొంతంగా అంతరిక్ష కేంద్రం కల సాకారం అయితే భారత్ కు అంతరిక్ష రంగంలో తిరుగే లేదు అనుకోవచ్చు. అందుకు తగినట్లుగా ఇస్రో అధికారులు ఉత్సాహవంతంగా ఉరకలు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతుతో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకొంటూ ముందుకు కదులుతున్నారు.