నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసనకు దిగే అవకాశం ఉంది. అయితే నిరసన ప్రదర్శనకు అనుమతి కోసం కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
శాంతిభద్రతల పరిస్థితిని ముందుగానే ఊహించిన ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జూన్ 13న రాహుల్ గాంధీని ఇదే కేసులో ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు పంపినప్పుడే కాంగ్రెస్ ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసింది. కాంగ్రెస్కు చెందిన సిట్టింగ్, మాజీ సీఎంలతో సహా పలువురు సీనియర్ నేతలు అప్పట్లో నిరసనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. న్యూఢిల్లీ జిల్లాలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. న్యూఢిల్లీ జిల్లాకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసులు బారికేడ్లు వేసి నిఘా ఉంచనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ నివాసం, ఈడీ కార్యాలయం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం అవుతుందని అంచనా వేసిన పోలీసులు పలుచోట్ల డైవెర్షన్ లను అమలు చేశారు. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు.