ఇటీవల వక్ఫ్ సవరణల చట్టం మీద వాదనల సందర్భంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు అనుసరిస్తున్న విధానాల మీద నెటిజన్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సున్నితమైన అంశాలకు సంబంధించి భిన్నమైన వాతావరణం నెలకొందని అంటున్నారు.
1. వక్ఫ్ చట్ట సవరణలు:
కాంగ్రెస్ వక్ఫ్ సవరణ చట్టం 2013 ను తీసుకువచ్చినప్పుడు, చాలా మంది హిందూ న్యాయవాదులు ఇది హిందూ వ్యతిరేకమని మరియు రాజ్యాంగ వ్యతిరేకమని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కానీ సుప్రీంకోర్టు వారి వాదనలు వినడానికి నిరాకరించి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కానీ, 12 సంవత్సరాల తర్వాత బిజెపి వక్ఫ్ సవరణ చట్టం 2025 ను తీసుకువచ్చినప్పుడు ఈసారి ముస్లింలు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈసారి సుప్రీంకోర్టు స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి సుప్రీంకోర్టు వారిని హైకోర్టుకు వెళ్లమని అడగలేదు, పై పెచ్చు అత్యవసర ప్రాతిపదికన విచారణ ప్రారంభించి, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దీని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
2. కాశీ జ్ఞానవాపి, ధార్ భోజ్‌శాల, కృష్ణ జన్మభూమి కేసులలో కంటికి కనిపించే ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ, కోర్టులు వేగంగా నిర్ణయం తీసుకోలేదు. దీని మీద లోతుగా అధ్యయనం జరగాలని, అప్పటి చారిత్రక ఘట్టాలకు బలమైన ఆధారాలు కావాలని అడుగుతున్నాయి. కానీ, వందల సం. ల క్రిందట వక్ఫ్ ఆస్తులకు రుజువులు కాగితాలు ఎలా ఉంటాయి అని ఇదే సుప్రీం ప్రశ్న లేవనెత్తింది. దీని మీద సోషల్ మీడియాలో వాదనలు చోటు చేసుకొంటున్నాయి.
3. శబరిమలై లో మహిళల ప్రవేశం మీద కూడా ఇటువంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఈ దేశంలోహిందూ స్త్రీలు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు అని ప్రపంచానికి చాటే లాగా .. శబరిమల కు ఏ సంబంధం లేని ఒక NGO పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు స్పందించింది. దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్త్రీల ప్రవేశం పై ఆంక్షలను రద్దు చేసింది. కానీ మసీదులలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు పై వేసిన పిటిషన్ ను ఇప్పటికీ కోల్డ్ స్టోరేజి లో పెట్టింది, ఇప్పటికి ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి తప్పితే దీనికి పరిష్కారం దొరకలేదు అని నెటిజన్లు అంటున్నారు.
4. ముస్లింలు, క్రిస్టియన్స్ తమ ప్రార్ధనా మందిరాలను ఆస్తులను వారే స్వతంత్రంగా చూసుకుంటున్నారు, కానీ, దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీ లో ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే అదే తరహా వెసులుబాటు హిందువులకు జైనులకు కూడా కల్పించండి అని అశ్వని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్ కొట్టేసింది. దీనిని సుప్రీం కోర్టు ఎందుకు అంగీకరించలేదు అన్నది నెటిజన్ల ప్రశ్న.
5. శతాబ్దాలుగా హిందువుల గ్రామదేవతలకు మరి కొన్ని దేవతలకు కొన్ని పండుగలు అప్పుడు బలులు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అలాగే జల్లికట్టు మీద సుప్రీంకోర్టు చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ బక్రీద్ సందర్భంగా భారీ ఎత్తున జంతు బలులు గురించి కోర్టులు ఎందుకు పట్టించుకోవు అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.
6. ప్రార్ధనా మందిరాలలో జరిగే తంతుకు ఏ మాత్రం సంబంధం లేకుండా, కేవలం జస్ట్ మత ఆస్తులు మాత్రమే పర్యవేక్షణ చేసే వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులను ఎలా వేస్తారు, ఇలాగే హిందూ దేవాలయ బోర్డ్స్ లో వేస్తే ఒప్పుకుంటారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కానీ అనేక సందర్బాల్లో హిందువేతరులు, కమ్యూనిస్టులను దేవాలయ ట్రస్ట్ బోర్డులలో నియమించారు. మన తెలుగు నాట కూడా దేవాలయ పాలక మండళ్ల లో అనేక మంది అన్య మతస్తులు పదవులు తీసుకొన్నారు.
7. 1990లో కాశ్మీర్ లో హిందువుల ఊచకోతపై విచారణ జరిపి నేరస్తులను శిక్షించండి అంటే 30 సం. ల క్రిందట కేసు సాక్ష్యాలు ఎలా లభిస్తాయి అంటూ పిటిషన్ తిరస్కరించింది. అసలు విచారణ జరపకుండా సాక్ష్యాలు దొరకవు అని నిరాకరించడం.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద సోషల్ మీడియాలో సుప్రీంకోర్టుకి సంబందించి పెద్దదుమారమే నడుస్తోంది. అయితే భారత రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు ఎన్నెన్నో గొప్ప తీర్పులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొంటే సుప్రీంకోర్టు గొప్పతనం అర్థం అవుతుంది, కానీ కొన్ని సంఘటనల్లో నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు కూడా బలంగానే నిలుస్తున్నాయి.