130 సంవత్సరాల పూర్వం జన్మించిన అంబేద్కర్ను మనం ఎందుకు స్మరించుకోవాలి, అంబేద్కర్ జీవితం మనకు ఏమినేర్పిస్తోంది , జీవితంలో అడుగడుగున అవమానాలు, అవహేళన ఎదుర్కొంటూకూడా తన జీవితాన్ని ఎలాఉన్నత శిఖరాలకు తీసుకోని వెళ్ళవచ్చో అంబేద్కర్ జీవితం నుండి నేర్చుకోవచ్చు. అట్లాగే అవమానాలను అవహేళనలు సహిస్తూ ఈ దేశం కోసం ఎలా జీవించవచ్చోదానికి అంబేద్కర్ ఒక ఐకాన్ . ఈ దేశ చరిత్రలో నిత్య స్మరణీయుడు. స్వాతంత్ర పోరాట కాలంలో దేశానికి స్వతంత్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన అనేక సమావేశాలలో ఎట్లా స్పష్టంగా మాట్లాడాడో మనం చూడవచ్చు. అట్లాగే ఈ దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ఎలా పని చేశాడు అర్థం చేసుకోవాలి , ఈ దేశం భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలపై ఎట్లా విస్పష్టంగా హెచ్చరించాడో తెలుసుకోవచ్చు. ఈ సమయంలో వారి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటం ఎంతో అవసరం.
భారతదేశంలో రాబోయే రోజుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ రాబోతున్నది, దానిలో ఈ దేశంలో ఉండే ప్రజలను ఎలా భాగస్వామ్యం చేయాలి అనే విషయాల గురించి ఆలోచించాడు . వేల సంవత్సరాల చరిత్రకలిగినదేశం , ఎంతో గొప్ప సంస్కృతి ఉంది, ఎంతో వైవిధ్యభరితమైనది ఈ దేశం. ఈ దేశంలో అనేక భాషలు, జీవన పద్ధతులు సామాజిక వ్యవస్థలు , ధార్మిక వ్యవస్థలు మనకు కనబడుతుంటాయి . ఇంతటి వైవిధ్యభరితమైన దేశంలో సమస్యలకు కూడా కొదువ వుండదు. వందల సంవత్సరాలుగా అనేక సామాజిక సమస్యలతో సతమతమవుతూ ప్రయాణం చేస్తున్న దేశం. ఈ విషయం మనందరికీ తెలుసు భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారానికి అందులో ప్రజా స్వామ్య వ్యవస్థలో పరిష్కారానికి అనుసరించవలసిన విధానాలను రాజ్య వ్యవస్థ లోనే ఎట్లా ఉండాలో స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నవారు అంబేద్కర్. ఈ సందర్భంగా వారు సూచించిన రెండు విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడం బాగుంటుంది.
1] 1930 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో దళితుల ప్రతినిధిగా మాట్లాడుతూ” పాలనా వ్యవస్థలో అట్టడుగు వర్గాల కు తగినంత ప్రాతినిధ్యం ఉండాలి, భవిష్యత్ భారత దేశ పాలనా వ్యవస్థలో కూడా తగినంత ప్రాతినిధ్యం ఉండాలని” వారు స్పష్టంగా పేర్కొన్నారు.
2] 1947 ఆగస్టు 29న ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు అంబేద్కర్ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వారి అధ్యక్షతన రూపుదిద్దుకున్న రాజ్యాంగంలో మానవతా దృక్పథం తో అంటరాని తనాన్ని నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలకు చట్టబద్దత కల్పించారు. నిమ్నవర్గాల ప్రజలకు సామాజిక న్యాయం కల్పించారు. నిమ్నవర్గాల ప్రజల అన్ని రకాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో చట్టబద్ధమైన హక్కులను కల్పించారు, అట్లా సామాజికంగా రాజకీయంగా వారికీ ఒక దిశానిర్దేశనం రాజ్యాంగబద్ధంబద్ధం చేసారు.
1950వ సంవత్సరం జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసుకునే సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కొన్ని అంశాలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా అవసరం. వారి ప్రసంగంలో” ఈ దేశం రాజకీయ స్వాతంత్రం సంపాదించుకుంది ఇంకా సంపాదించుకో వలసినది సామాజిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఈ దేశ ప్రజలజీవన విధానం , అది ఎట్లా ఉండాలి ? ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం నిర్మాణం కావాలి . అదే ఈ దేశ ప్రజలను కలిపిఉంచగలుగుతుంది. ఆ మూడు పరస్పరం పెనవేసుకున్న విషయాలు, దేనికదిగా వాటిని విడివిడిగా మనం చూడలేము, అందులో ఏఒక్కటి తొలగించిన ప్రజాస్వామ్య మనుగడ ఉండదు,1] సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది 2] స్వేచ్ఛలేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది 3]సోదరభావం లేని స్వేచ్ఛా సమానత్వం సహజంగా ఉండలేవు, సోదరభావం లేనిచోట స్వేచ్ఛ సమానత్వాన్ని బలవంతంగా రుద్ది వలసిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయాలి, అట్లా చేసేందుకు ఈ దేశంలోవందల సంవత్సరాలనుండి అనేక మంది వ్యక్తులు, సంస్థలు పని చేసుకుంటూవస్తూనేఉన్నాయి , ఆ ప్రయత్నాల ప్రభావం సమాజంలో పరివర్తన దిశ మనకు కనబడుతోంది. ఈ రోజుల్లో కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ప్రబలమైన సమస్య రాజకీయ ఆధిపత్యం . అధికారంకోసం సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి . ఒక ప్రక్క కులాలను మరిచిపోవాలని, కులాల ఆధిపత్యంతొలగిపోవాలని మాట్లాడుతూనే కులాలను గుర్తుచేస్తూ రెచ్చగొడుతున్నారు. దేశ ప్రజలలో అపోహలు అవిశ్వాసం, సంఘర్షణలు నిర్మాణం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించి వలసింది గ్రామాలలో, గ్రామాలలో ఒకప్పుడు సామాజిక ప్రజాస్వామ్యం ఉండేది, కానీ అది ఈ రోజు ఎంతగాద్వంసమైందో మనం అందరం చూస్తూనే ఉన్నాం, గ్రామాలలో రాజకీయాల కారణంగా స్పర్ధలు , వైషమ్యాలు నిర్మాణం చేయటం ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. సమస్యలు సృష్టించేందుకు, వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ పేరును ఎట్లా ఉపయోగించుకుంటున్నారో కూడా మనంచూస్తున్నాము. ఈ రోజున కమ్యూనిస్టులు , మావోయిస్టులు, ఉదారవాదం ముసుగు ధరించిన అనేక మంది మేధావులు, ఈ సమాజంలో ఒక బేధ తంత్రాన్ని నడుపుతున్నారు దానిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది .
అంబేద్కర్ చేసిన కొన్ని హెచ్చరికలను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి
1] భారతదేశంలో కమ్యూనిజాన్ని మనం పెరగ నివ్వకూడదు అని చెప్పారు. కమ్యూనిస్టులు తమ రాజకీయ లాభాల కోసం కార్మికులను ఎట్లా ఎరగా వాడుకుంటున్నారో అంబేద్కర్ వివరించారు . కమ్యూనిజాన్ని నిరోధించాలని గట్టిగా చెప్పారు . ఈ విషయం మనకు దత్తోపంత్ జీ అంబేద్కర్ గురించి వ్రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా కనబడుతుంది, అంబేద్కర్ దత్తోపంత్ జీ తో” కమ్యూనిజానికి దళితులకు మధ్య నేను ఒక ఇనుప గోడ గా నిలబడతాను, మిగతా సమాజానికి కమ్యూనిజం కు మధ్య మీరు ఇనుప గోడలాగా నిలబడాలని” సూచించారు. కమ్యూనిజం గురించి అంబేద్కర్ కు ఎంత స్పష్టత ఉందొ మనకు అర్థమవుతుంది.
2] ఈ దేశంలో పిడి వాదులను హెచ్చరించేందుకు తాను హిందూమతంలో కొనసాగ లేను అని స్పష్టంగా చెప్పారు. ఈ వార్త దేశంలో అనేక ప్రకంపనాలను సృష్టించింది, ముస్లిం, క్రైస్తవులు మొదలైనవారు అంబెడ్కర్ ను తమ మతం లోకి రావాలని ఆహ్వానించారు, మతం మార వద్దని అనేకమంది సంస్కరణ వాదులు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు, కానీ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు . బౌద్ధమతం హిందూ సమాజంలోని కుతర్క వాదాలను సంస్కరించేందుకు ప్రారంభమైన ఒక సంస్కరణ సిద్ధాంతం, అంటే బౌద్ధం హిందూ సమాజంలో ఒక అంతర్భాగమని మనకు అర్థమవుతుంది. అంబెడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన దేశంలో లో సమానత్వం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఈ రకంగా బౌద్ధం స్వీకరించడానికి వాళ్ల కుటుంబ నేపథ్యాన్ని కూడామనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ తాత మాలోజీరావు రామానంద భక్తిమార్గంలో దీక్ష తీసుకున్నారు, తండ్రి రాంజీ కబీర్ భక్తిమార్గంలో దీక్ష తీసుకుంటే వారి పెదనాన్న సన్యాస దీక్ష తీసుకున్నారు, ఆ కుటుంబ పరంపర అటువంటిది.
3 అంబేద్కర్ రచించిన” థాట్స్ ఆన్ పాకిస్తాన్” గ్రంథంలో లో ముస్లిం మనస్తత్వాన్ని ఎంతో చక్కగా విశ్లేషించారు. ముస్లిములు భారత దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ద్వేషించటం కంటే ఈ దేశం బయట ఉండి వ్యతిరేకించటం ఎంతో మేలు అని చెప్పారు. అందుకే దేశ విభజన సమయంలో ఈ దేశం లో ఉన్న ముస్లిముల నందరి ని పాకిస్థాన్ కు పంపించి వేయాలని, విడిపోయిన భూభాగంలో ఉన్నహిందువులనందరిని భారతదేశం తీసుకుని రావాలని చెప్పిన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ . అప్పటి నాయకుల అనాలోచిత వ్యవహారం ఈ దేశానికి ఎంతో నష్టం చేసింది లక్షల మంది సంహరించబడ్డారు కోటి మంది ప్రజల మార్పిడి జరిగింది , ఇంతటి విధ్వంసాన్ని నిలువరించేందుకు ఎవరూ ఏమీ చేయలేకపోయారు, అస్పష్టమైన ఆలోచనలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో విభజన చరిత్ర చెప్పే పాఠం, దానికి ఇప్పటికే ఎంతో మూల్యం చెల్లించుకున్నాము, ఇంకాచెల్లించుకొంటూనేఉన్నాం ఉన్నాము.
4] ఈ దేశంలో ఉన్న అన్ని భాషల కు మూలం సంస్కృతం. వేల సంవత్సరాలుగాఈ దేశాన్ని కలిపి ఉంచుతున్న భాష సంస్కృతం, ఆ సంస్కృతభాషను మన జాతీయ భాష ప్రకటించాలని 1928లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో స్పష్టం చేశారు. ఒకవేళ సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించి ఉన్నట్లయితే ఇవాళ దేశం ఎదుర్కొంటున్నభాషా సమస్యలు ఇంత తీవ్రంగా ఉండక పోయేవి , దానికి అప్పటి నాయకత్వం అంగీకరించని కారణంగా రాజ్యాంగంలో లేని ఇంగ్లీష్ భాష ఈ దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్నది, రోజు రోజుకు ఆ భాష మీద విపరీతమైన వ్యామోహం ఈ దేశంలో పెరుగుతోంది , దాని కారణంగా ఈ దేశ ప్రజలను సంస్కృతి సంప్రదాయాల నుండి దూరం చేస్తున్నది . దూరదృష్టి లేని నాయకత్వం దేశాన్ని సమస్యల గందరగోళంలోకి నెట్టివేసింది, దాని నుండి ఇంకా మనం బయట పడలేక పోతున్నాము
హిందూ సమాజంలో కాలదోషం పట్టిన అనేక వాదనలు వివాదాలకు విద్వేషాలకు కారణ అవుతున్నాయి, ఆ వివాదాలతో ఈ దేశాన్ని చీల్చేందుకు సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేసేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయి, ఆ శక్తులు కూడా నిమ్న వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయి , దానికి వాళ్లకు ఒక ఐకాన్ గా అంబేద్కర్ పేరు ను వాడుకొంటున్నారు. అంబేద్కర్ వివిధ సందర్భాలలో అప్పటి అవసరాలకు మాట్లాడిన విషయాలకు వక్ర భాష్యం చెబుతూ దళిత వర్గాలను రెచ్చగొడుతున్నారు,వాటిలోఒకటి అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన సమయంలో ఈ దేశంలోని దేవీ దేవతలను పూజించ వద్దని చెప్పాడని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ దేశ సమైక్యతకు నష్టం కలిగించేకమ్యూనిజం మొదలైన సిద్ధాంతాలను అంబేద్కర్ చాలా స్పష్టంగా వ్యతిరేకించారు , తీవ్రంగా హెచ్చరించారు, ఆ సిద్ధాంతాల వాళ్లే ఈరోజు దళితులను గందరగోళంలో పడేసేందుకు అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు మావోయిస్టులు ఉదారవాదులు అనేకమంది దళితులను హిందూ సమాజం నుంచి వేరుచేసే షడ యంత్రం నడిపిస్తున్నారు. ఆ శక్తుల వాదనలను పటాపంచలు చేయాలి. ఈ దేశంలో జన్మించిన అంబేద్కర్ మొదలైన అనేకమంది జాతీయ మహా పురుషులు ఆశించిన దేశ సమైక్యతను సాధించేందుకు మనం ప్రతినబూన వలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈ దిశలో ప్రయత్నం చేయడమే అంబేద్కర్ కు మనం సమర్పించే నిజమైన నివాళి అవుతుంది.