తనపై, తన కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరాలకు లీగల్ నోటీసులు పంపించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. తన కుమార్తె జోయిష్ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. అయితే అవన్నీ అవాస్తవాలని…తనకు క్షమాపణ చెప్పాలంటూ స్మృతీ వారికి నోటీసులు పంపించారు.
స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ (18) గోవాలో అక్రమ లైసెన్స్‌తో బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. చనిపోయిన వ్యక్తి పేరుతో లైసెన్స్‌ను తీసుకుని బార్ అండ్ రెస్టారెంట్ నడుతున్నారని, దానిపై స్థానిక అధికారులు షోకాజు నోటీసులు కూడా పంపించారని ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. స్మృతి ఇరానీని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన స్మృతి ఇరానీ వీటిని కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతలైన రాహుల్ గాంధీ, సోనియాగాంధీల దోపిడీని ప్రశ్నించినందుకే తన కుమార్తె లక్ష్యంగా చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. దీనిపై కోర్టుకు వెళ్తానని స్మృతి ఇరానీ శనివారం హెచ్చరించారు.
జోయిష్ ఇరానీ ఏ బార్‌ను నడపడానికి.. ఏ వ్యాపార సంస్థకు లైసెన్స్ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని, కాంగ్రెస్ నాయకులు ఆరోపించినట్టుగా గోవాలోని ఎక్సైజ్ శాఖ నుంచి తన కుమార్తెకు ఎటువంటి షోకాజ్ నోటీసులు అందలేవని నోటీసులో వెల్లడించారు. ఆ ఆరోపణలన్నీ అవగాహన లేకుండా చేసినవని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం జోయిష్ ఇరానీపై చేసిన ఆరోపణలను సమర్థించుకుంది. సాక్ష్యంగా చూపుతూ ట్విట్టర్లో వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆదివారం గోవాలోని రెస్టారెంట్ ముందు నిరసన కూడా చేపట్టింది.