చైనా వేసే ప్రతి ఎత్తుకు పెఎత్తు వేస్తూనే ఉంది భారత్. డ్రాగన్ దేశానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉంది. హిందూ మహా సముద్రంలో దొంగలా కాపుకాసి భారత్‌ను దెబ్బతీయాలనుకున్న చైనా ఆశలన్నీ అడియాసలయ్యాయి. డీఆర్డీవో అక్కడ ఓ కీలక టార్పిడోను ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ఒక కీలక పరీక్షలో విజయం సాధించింది. సూపర్ సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో పరీక్షించింది. సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పిడో(స్మార్ట్)ను ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు. తీరం వెంట ఉన్న ట్రాకింగ్ స్టేషన్లు, టెలిమెట్రీ స్టేషన్లు టార్పిడో గమనాన్ని మానిటర్ చేశాయి. ట్రాకింగ్ స్టేషన్లలోని రేడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లు మిస్సైల్ టార్పిడోను పరీక్షించాయి. లైట్ వెయిట్ యాంటీ సబ్‌మెరైన్ టార్పిడోలను మిస్సైల్స్ ద్వారా రిలీజ్ చేయడం ఈ పరీక్షలో విశేషం. టార్పిడో రేంజ్లో లేని యుద్ధాల్లో ఇలాంటి వినియోగం ఉంటుంది.
కీలకమైన ప్రాజెక్టు
2016లో రూ.340 కోట్లతో బ్రహ్మోస్ మాక్ 3 యాంటీషిప్ మిసైల్ ప్రాజెక్టు చేపట్టారు. ఆ తర్వాత చేపట్టిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఇదే. దీని ద్వారా దేశ సముద్ర జలాల్లోకి ప్రమాదకరంగా చొచ్చుకొచ్చే శత్రు సబ్మెరైన్లను దూరం నుంచే ధ్వంసం చేయవచ్చు. దీని రేంజి దాదాపు 650 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
రెండు రకాల ఆయుధ వ్యవస్థలతో దీనిని అభివృద్ధి చేశారు. భారత్ ఇప్పటికే టార్పిడోలు, క్షిపణులు తయారు చేస్తోంది. ఈ టెక్నాలజీలను కలిపి సరికొత్త హైబ్రీడ్ ఆయుధాన్ని తయారు చేశారు. సాధారణంగా భారీ టార్పిడోలు 50 కిలోమీటర్లు, రాకెట్ అసిస్టెడ్ విధానంలో అయితే 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. ఈ సరికొత్త హైబ్రీడ్ విధానంలో తయారయ్యే టార్పిడో 600 కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు సబ్మెరైన్లను ధ్వంసం చేయగలదు.
తప్పించుకునే అవకాశాలుండవు
స్మార్ట్ను యుద్ధనౌకలపై నుంచి లేదా సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్‌పై నుంచి ప్రయోగించవచ్చు. ఇది లక్ష్యానికి చాలా దగ్గరి వరకు గాల్లోనే ప్రయాణిస్తుంది. సబ్‌మెరైన్ సమీపానికి రాగానే గాల్లో నుంచి నీటిలోకి టార్పిడోను పడేస్తుంది. దీంతో అది నేరుగా వెళ్లి లక్ష్యాన్నిఛేదిస్తుంది. దాడికి కొన్ని క్షణాల ముందుకు వరకు కూడా ఈ టార్పిడోను శత్రుసబ్మెరైన్ గుర్తించలేదు. అప్పటికప్పుడు శత్రుసబ్మెరైన్ అప్రమత్తమైనా తప్పించుకునే అవకాశాలుండవు. స్మార్ట్ గాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల రాడార్లకు అంత తేలిగ్గా దొరకదు. దీనికి డేటా లింక్‌లు ఉండటంతో నియంత్రణలో ఉంటుంది. ఈ క్షిపణికి సంబంధించిన అన్ని లక్ష్యాలు అనుకున్న స్థాయిలో ఉంటాయి. అమెరికా, రష్యాలు ఇలాంటి ప్రయోగాలు ఇప్పటికే చేశాయి. చైనా వద్ద వైయూ-8 పేరుతో ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంది. కానీ దాని రేంజ్ చాలా తక్కువ. మన భారత్ అభివృద్ధి చేసిన స్మార్ట్ చాలా గొప్ప వ్యవస్థ.
పట్టు సాధించేందుకు ప్రయత్నం
చైనా మన దాయాది దేశాలను మచ్చిక చేసుకునే కుయుక్తులతో పాటు హిందూ మహాసముద్రంపై పట్టు సాధించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. హిందూ సముద్ర అంతర్భాగంలో పెద్ద ఎత్తున సబ్మెరైన్లను ఉంచింది. వాటిని గుర్తించి ధ్వసం చేసే పెద్ద వ్యవస్థ మన దేశానికి ఇంత వరకు లేదు. అందుకే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు డీఆర్డీఓ యాంటి సబ్ మెరైన్ వ్యవస్థ రూపకల్పన దిశగా ప్రయోగాలు మొదలుపెట్టింది.
బాలిస్టిక్ మిసైల్, టార్పిడో కలిస్తే స్మార్ట్
స్మార్ట్ పేరిట రూపొందించిన ఆయుధ వ్యవస్థ.. బాలిస్టిక్ మిసైల్, టార్పిడో కలిస్తే స్మార్ట్‌గా రూపాంతరం చెంది శత్రువుల సబ్ మెరైన్లను నిరోధిస్తాయి. స్మార్ట్ క్షిపణి కమ్ టార్పిడో ఓ గేమ్ ఛేంజర్. భవిష్యుత్తులో ఎటువంటి యుద్ధం వచ్చినా దాంట్లో విజయం సాధించే రీతిలో మన దళాలు సిద్ధం అవుతున్నాయి. పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం మనదేశానికి ఉంది. ఇప్పటికే మన రక్షన దళాలు ఉత్తమంగా ఉన్నాయి. సమర సామర్ధ్యాన్ని, విశ్వసనీయతను పెంచడమే తమ లక్ష్యమని, ఆధునీకరణ, ఆపరేషనల్ ట్రైనింగ్, స్వదేశీ ఆయుధాల వినియోగాన్ని పెంచడం వంటి అంశాలపై భారత్ దృష్టి పెట్టింది.
సంక్లిష్ట పరిస్థితి ఎదురైతే గట్టి జవాబు
రానున్న అయిదేళ్లలో మరో 83 ఎల్సీఏ మార్క్ 1 విమానాలకు ఆర్డర్ ఇవ్వనుంది. స్వదేశీ ఉత్పత్తిలో డీఆర్డీవో, హెచ్ఏఎల్కు సపోర్ట్ ఇస్తోంది భారత్. హెచ్‌టీటీ40, లైట్ కంబాట్ హెలికాప్టర్లకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకోనుంది. శత్రుదేశాల నుంచి ఎటువంటి విపత్తు ఎదురైనా, దాన్ని ఎదుర్కొనేందుకు బలమైన, స్థిరమైన రీతిలో మన రక్షణ దళాలు అంతటా మోహరించాయి. చైనా సరిహద్దుల్లో మన పొజిషన్ మెరుగ్గా ఉంది. సంక్లిష్ట పరిస్థితి ఎదురైతే చైనాకు మనం గట్టి జవాబు ఇవ్వగలం. సరిహద్దు దళాల్లో చైనా కన్నా మెరుగైన రీతిలో బలగాలు మోహరించాయి. అయితే రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా భవిష్యత్తు పరిస్థితి ఆధారపడి ఉంటుంది. బలగాల ఉపసంహరణ కోసం చర్చలు జరుగుతున్నాయి.
అభినందనల వెల్లువ
సూపర్ సానిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో రెడీ చేయడంతో అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. మొదట కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది యాంటీ సబ్ మెరైన్ యుద్ధతంత్రంలో కీలమైనదని ఆయన పేర్కొన్నారు.ఇంతటి విజయానికి కారణమైన డీఆర్డీవో అధికారులను రాజ్ నాథ్‌సింగ్ అభినందించారు. సాంకేతిక పరంగా ఇది గొప్ప విజయమని, యుద్ధ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్’లో స్మార్ట్ క్షిపణి కీలకంగా వ్యవహరిస్తుంని డీఆర్డీవో ఛైర్మన్ డి. సతీశ్ రెడ్డి అన్నారు. ఇక ఈ నెల ఆరంభంలో ‘లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్’ క్షిపణిని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయానికి కారణమైన డీఆర్డీవో శాస్త్రవేత్తలను, ఇతర భాగస్వాములను అందరూ అభినందిస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణి+టార్పిడోలతో ఏర్పడిన స్మార్ట్ త్వరలోనే చైనాకు సంబంధించిన సబ్మెరైన్లను ధ్వసం చేయనుంది. హిందూ మహాసముద్రంలో దొంగలా కాపుగాస్తున్న చైనాను జలసమాధి చేయనుంది.