బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్టేట్ రైఫిల్స్ (TSR) సహాయంతో కైలాసహర్ సమీపంలోని గౌర్నగర్ బ్లాక్‌లోని ఇచాబ్పూర్ ప్రాంతంలో షెహనాజ్ అలీ ఇంటిపై దాడిచేసి అరెస్టు చేశారు.
వీరి చొరబాట్లపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైనట్టు తెలిసింది. బంగ్లాదేశ్ నుంచి మేఘాలయలోని దావ్కీ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు వారు అంగీకరించారు. ఆ తర్వాత వారంతా అసోం నుంచి అగర్తలా వెళ్లారు. నకిలీ పత్రాలు సృష్టించి భారతీయ పౌరులుగా స్థిరపడాలని వారు ప్లాన్ చేసుకున్నారు. ఇచాబ్పూర్లోని ఉత్తర త్రిపుర ప్రాంతానికి వెళ్లారు.
త్రిపుర పోలీసుల అధికారిక నివేదిక ప్రకారం 2018నుంచి 2021 మధ్య కాలంలో కనీసం 108 మంది రోహింగ్యా శరణార్థులను అరెస్ట్ చేశారు. వారి జాతి, మతంతో సంబంధంలేకుండా విదేశీయుల చొరబాట్లపై రాష్ట్రవ్యాప్త విచారణ జరపాలని పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న అక్రమ వలసలపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.