
Supreme Court of India
పెళ్లి రద్దుపై సుప్రీం కోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. కలిసి సంతోషంగా బతకలేని స్థితిలో ఆ జంట విడాకుల కోసం ఆరునెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని… వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిపింది. కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనను సడలించింది. ఈమేరకు తమకు విశిష్ట అధికారాలున్నాయని గుర్తు చేసింది. దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమై, కలిసి జీవించలేని స్థితి నెలకొంటుందని… అలాంటి స్థితిలో వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం ఆర్టికల్ 142 కింద తమకు ఉంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి కేసుల్లో పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు విధించే ఆర్నెళ్ల గడువు అక్కర్లేదని అంది. కుటుంబ న్యాయస్థానాలకు రెఫర్ చేయకుండా నేరుగా సుప్రీం విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి.2016 జూన్ 29న ఆ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. విచారణ చేసిన ధర్మాసనం గతేడాది తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా జస్టిస్ ఎస్.కే. కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.