పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి లో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం టిక్కెట్ ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.
……
భక్తుల కొంగు బంగారం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రమైన తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ దర్శనం చేసుకొంటే ఉత్తమ ఫలితాలు దొరుకుతాయి అని భక్తుల విశ్వాసం. అయితే, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే ఈ దర్శనం కోసం అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనాలు కల్పించడం సాధ్యం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది.
…….
వైకుంఠ ద్వార దర్శనాల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొంది. తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి,, టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తిరుపతిలో బుధవారం రాత్రి నుంచి భక్తులు కౌంటర్ లు వద్దకు చేరుకున్నారు. విపరీతమైన చలిగాలుల మధ్య నడిరోడ్డు మీద పార్కులలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి.
ఈ నెల 9న , అంటే గురువారం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించింది. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలివచ్చారు. దాంతో భక్తులు రోడ్లపై గుమిగూడకుండా స్థానిక పార్కులలోకి సిబ్బంది తరలించారు. భక్తులను పద్మావతి పార్క్ నుంచి క్యూలైన్లలోకి వదిలే సమయంలో తొక్కిసలాట జరిగింది. మూడు ఘట్టాలలో తోపులాట జరిగింది అని సమాచారం.
కొంతకాలంగా తిరుమలలోని దేవాదాయ శాఖ సిబ్బంది మీద ఆరోపణలు ఉన్నాయి. భక్తులను పట్టించుకోవడం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణలో కూడా మితిమీరిన నిర్లక్ష్యం తోటే భక్తుల ప్రాణాలు పోయాయి అని యాత్రికులు ఆరోపిస్తున్నారు.
……..
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ అంటోంది. దురదృష్టవశాత్తు తొక్కిసలాట చోటుచేసుకుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెబుతున్నారు.
…..
విపరీతమైన చలి గాలుల మధ్య,, రాత్రంతా పార్కులో భక్తులను ఉంచడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైంది అని అంటున్నారు. ముఖ్యంగా సిబ్బంది నిర్లక్ష్యమే యాత్రికుల కొంప ముంచింది అని తెలుస్తోంది. పాపం ఎవరిది అయినా శాపం మాత్రం భక్తులకే తగిలింది.