ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు.ఆదివారం సాయంత్రం మాన్సాలోని జవహర్కే గ్రామంలో ఈ దాడి జరిగింది. మూసేవాలా తోపాటు అతని ఇద్దరు సహచరులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభదీప్ సింగ్ సిద్ధూ (28 సంవత్సరాలు).. పంజాబ్‌లోని మాన్సాలోని మూసా గ్రామానికి చెందినవాడు. అతను కెనడాలో తన కెరీర్‌ను “G వాగన్” పాటతో ప్రారంభించి భారతదేశంలో ప్రజాదరణ పొందాడు.
భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాడికి ఒక రోజు ముందు సిద్ధూ మూసేవాలా భద్రతను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఆప్ ప్రభుత్వం మొన్న భద్రతను ఉపసంహరించుకున్న 424 మంది VIPల జాబితాలో అతను ఉన్నాడు. మూసేవాలా తన సన్నిహితులతో కలిసి హీంద్రా థార్ కారులో వెళ్తుండగా దాడి జరిగింది. మూసేవాలా వాహనంపై అనేక బుల్లెట్ రంధ్రాలు కనిపించడంతో దాడి చేసినవారు దాడి సమయంలో అనేక రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారణ చేశారు.
అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడైన మూసేవాలా.. 2021 నవంబర్‌లో పంజాబ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన మాన్సా నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆప్‌కి చెందిన మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లా 63,323 ఓట్ల తేడాతో ఆయనను ఓడించారు. దాడి జరిగిన సమయంలో మూసేవాలా స్వయంగా వాహనం నడుపుతున్నాడు.
అయితే సిద్ధూ మూసేవాలా హత్యకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. తన ఫేస్బుక్ ఖాతా నుంచి ఒక పోస్ట్‌లో, వివాదాస్పద గాయకుడి హత్యకు బ్రార్ బాధ్యత వహించాడు. బ్రార్ తన సహచరుల హత్యకు మూసేవాలా కారణమని.. పోలీసులు అతనిపై చర్య తీసుకోనందున.. మూసేవాలాను హత్య చేసానని తెలిపాడు.
లారెన్స్ గ్యాంగ్‌స్టర్ గ్రూప్ కూడా ఈ హత్య చేసింది తామేనని ధృవీకరిస్తూ ఫేస్బుక్ పోస్ట్‌ను ప్రచురించింది. కెనడాలో నివసిస్తున్న గోల్డీ బ్రార్, హత్య జరిగిన కొద్దిసేపటికే ఈ ఫేస్బుక్ పోస్ట్‌ను పోస్ట్ చేశాడు.
హత్యతో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఆరుగురిని ఉత్తరాఖండ్, పంజాబ్ సంయుక్త పోలీసు బృందం అరెస్టు చేసింది. డెహ్రాడూన్‌లో వీరిని అదుపులోకి తీసున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ ఘటనపై హై కోర్టు జడ్జితో విచారణకు ఆదేశించారు.