సైనాకు క్షమాపణ చెప్పాడు నటుడు సిద్ధార్థ. ఓ వైపు నెటిజన్ల నుంచి ఆగ్రహం, వరుస ట్వీట్లు, మరోవైపు జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గాడు సిద్ధూ. తన వ్యంగ్య హాస్యానికి క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. అందుకు స్పందించిన సైనా సున్నితంగానే గట్టిగానే బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా సిద్ధార్థ తన తప్పు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని.. ఓ మహిళ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు సరికాదని హితవు పలికింది.
పంజాబ్ ఘటన సందర్భంగా దేశప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సైనా ట్వీట్ చేశారు. అయితే ఆమె ట్వీట్ కు రీట్వీట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్య చేశాడు సిద్ధార్థ. దీంతో నెటిజన్లు సిద్ధార్థపై అసహనం వ్యక్తం చేశారు. ట్వీట్లతో యుద్ధం మొదలుపెట్టారు. సైనాకు మద్దతుగా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా రంగంలోకి దిగారు. జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ గా స్పందించింది. పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సైతం సైనాకు మద్దతుగా నిలిచారు. దీంతో సిద్ధార్థ వెనక్కి తగ్గక తప్పలేదు. తాను అన్నమాటకు క్షమాపణ చెప్పుతున్నానన్నాడు. దీనికీ వెంటనే ట్విట్టర్ వేదిగ్గానే స్పందించిన సైనా…సిద్ధార్థ ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషంగా ఉందన్నారు. మహిళ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు సరికాదని హితవు చెబుతూ సిద్ధార్థ బాగుండాలని ఆకాంక్షించారు. దీంతో సైనా, సిద్ధార్థ ట్వీట్ల యుద్ధానికి తెరపడింది.