ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేశవ్యాప్తంగా విశేష దృష్టిని ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న “శివాజీ స్ఫూర్తి కేంద్రం”ను సందర్శించారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. RSS క్షేత్ర ప్రచారక్ భరత్ జీ, స్ఫూర్తి కేంద్రం కోర్డినేటర్ నాగేశ్వరరావు తదితరులు ఈ ప్రాంగణం విశేషాలను మోదీ బ్రందానికి తెలియచేశారు.
….
వాస్తవానికి ఛత్రపతి శివాజీ కొంత కాలం శ్రీశైలంలో తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షం అయి, స్వయంగా ఒక ఖడ్గాన్ని ప్రసాదించారు. ఆ ఖడ్గం సాయంతో ఆయన పరాక్రమ యాత్రం చేసి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తిని కలిగించేందుకు.. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం దీనిని ఏర్పాటు చేశారు. RSS ఇచ్చిన స్ఫూర్తి తో కొందరు స్వయంసేవకులు పూనుకొని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యువతలో దేశభక్తిని పెంపొందించమే దీని ఉద్దేశ్యం. మహా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, వీరత్వం, ధర్మరక్షణ కోసం చేసిన త్యాగం వంటి అంశాలను ఆధునిక సాంకేతికతతో చూపిస్తూ ఏర్పాటు చేశారు. మోడల్ ప్రదర్శనలు, లైట్ అండ్ సౌండ్ షోలు, డిజిటల్ గ్యాలరీలు ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణలు. ఈ స్ఫూర్తి కేంద్రం వల్ల యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, స్వాభిమానం వంటి విలువలు పాదుకొనేందుకు వీలవుతుంది. శివాజీ స్థాపించిన హిందూ స్వరాజ్య భావన, ప్రజల పట్ల ఆయన చూపిన దయ, దేశ రక్షణలో చూపిన దృఢ సంకల్పం వంటి విలువలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
………………..
ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేంద్రంలోని ప్రతి విభాగాన్ని ఆసక్తిగా వీక్షించారు. శివాజీ బాల్యం, విద్య, గురు సమాగమం నుండి హిందవ సామ్రాజ్యం స్థాపన వరకు చూపిన దృశ్యాలను చూసి ప్రశంసలు అర్పించారు. భారతీయ స్ఫూర్తి, ఆత్మగౌరవం, ధర్మరక్షణ అనే మూడు విలువలను శివాజీ మహారాజ్ జీవితంలో నిక్షిప్తం చేసినందున, ఈ కేంద్రం యువతకు జీవన స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి శ్రీశైల అభివృద్ధి ప్రణాళికల వివరాలు వివరించారు. కేంద్ర సహకారంతో శ్రీశైలాన్ని జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
……………..
ఇలా ప్రధాని మోదీ సందర్శనతో ఈ కేంద్రం ప్రాముఖ్యత మరింత పెరిగింది. శ్రీశైలం ఇప్పుడు కేవలం భక్తి పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా, భారతీయ చరిత్రను, సంస్కృతిని సజీవంగా చూపించే స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తోంది. ఆ విషయాలన్నీ మోదీ పర్యటనతో మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
….