మకర విలక్కు సీజన్ సందర్భంగా ఈ నెలలో శబరిమలై ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. సుమారు రెండు నెలల పాటు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రద్దీ సమయంలో తీసుకోవలసిన చర్యల మీద అయ్యప్ప స్వామి భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం ముందు ఉంచేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు.
శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శబరిమల సంరక్షణ సంగమం సమావేశానికి వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హామీలు నెరవేరని కారణంగా యాత్రికులు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని పందళం ప్యాలెస్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ పి.ఎన్.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎదుట శబరిమల సంరక్షణ సంగమం పలు డిమాండ్లను ఉంచింది.
భక్తుల సౌకర్యం కోసం ఈ డిమాండ్లు తీసుకుని రావడం జరిగింది
.డిమాండ్లు:
త్రాగునీరు, విశ్రాంతి స్థలాలు మరియు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలలో తక్షణ మెరుగుదలలు.
శబరిమల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడే దిశగా పూజా వస్తువులలో స్వచ్ఛతకు హామీ.
యాత్రికుల కోసం మెరుగైన నియంత్రణ మరియు భద్రతను నిర్ధారణకు మందిరం భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించాలి.
సన్నిధానం సమీపంలోని ప్రైవేట్ రెస్టారెంట్ల మూసివేత, ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB) ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ.
ఆలయ ఆచారాలు మరియు సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం మరియు TDB చర్చల్లో పందళం ప్యాలెస్, భక్తుల సంస్థలు మరియు హిందూ సమూహాల ప్రతినిధులను చేర్చుకోవాలి.
అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌లో ఆలయం ఉన్నందున, శబరిమల వద్ద అన్ని అభివృద్ధి కార్యకలాపాల కోసం కేంద్ర మరియు రాష్ట్ర శాఖల మధ్య సమన్వయాన్ని కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయాలి.
శబరిమలైలో పవిత్రతను కాపాడాలని ఆర్ ఎస్ ఎస్, విహెచ్పి వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ మాట్లాడుతూ, స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు లేవని ఆరోపించారు. మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, హిందూ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్సన్ థిల్లంకేరీ మాట్లాడుతూ, హిందూ ప్రయోజనాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లౌకికవాదం ముసుగులో ప్రభుత్వం అయ్యప్ప భక్తులు, శబరిమల తీర్థాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. మౌలిక సదుపాయాలు, భద్రతతో పాటు వర్చువల్ క్యూ పరిమితి ఆందోళన కలిగిస్తోందన్నారు. స్పాట్ బుకింగ్‌లపై కూడా అనిశ్చిత కొనసాగడం విచారకరం అన్నారు.
భక్తులకు సౌకర్యం కల్పించేందుకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అని అంతా ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారు.