ఈ తరం విద్యార్థులు , యువతకు భారతీయ విలువలు సంప్రదాయం అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తలపెట్టిన సేవా ప్రదర్శిని.. చక్కటి చొరవ అని ఆయన అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బృహత్ మేళా సేవా ప్రదర్శని ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక ప్రదర్శనను హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ మరియు భారతీయ నైతిక, నైపుణ్య ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శన నవంబర్ 8 నుంచి 10 వ తేదీ దాకా.. అంటే మూడు రోజులు పాటు ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామివారు, రామకృష్ణ మఠం స్వామీజీ
శితికంఠానంద మహారాజ్ , ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సభ్యులు భాగయ్య ప్రారంభించారు. భారతీయ సంస్కృతి గొప్పతనం , చక్కని జీవితం గడపడానికి అవసరమైన విలువలపై వక్తలు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కన్య వందనం, ప్రకృతి వందనం, నారి వందనం, ఆచార్య వందనం, మాతృ-పితృ వందనం, మరియు పరమ వీర్ వందనం వంటివి నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతిరోజు 10 వేల మంది దాకా పాఠశాల విద్యార్థులు యువత పాల్గొంటారని అంచనా. ఈ తరం యువతకు తెలియజేసేందుకు వివిధ సేవా సంస్థల కార్యకలాపాల మీద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. భారతీయ విలువలతో పనిచేస్తున్న సంస్థలకు సంబంధించిన స్టాల్స్ తో ప్రాంగణం కళకళలాడుతోంది.