ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయిన ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయా హత్య వెనుక సంచల విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్య కోసం గుర్తు తెలియని శక్తులు నెలల తరబడి వేచి చూసి వెంటాడి చంపేసినట్లు బయటపడింది. ఈ హత్య కోసం ఇరాన్ లో పవర్ ఫుల్ సీక్రెట్ ఆపరేషన్ అమలు అయింది.
టెహ్రాన్‌లో హనియా ఉంటున్న ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, బాంబు పేలుడులో హనియా మృతిచెందినట్లు తాజాగా బయటికొచ్చింది. పక్కా ప్లాన్‌తో అతడి హత్య జరిగిందని, ఇందుకోసం రెండు నెలల ముందే ఆ ఇంట్లో బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సంచలన కథనం వెలుగు చూసింది.
ఈ సీక్రెట్ ఆపరేషన్ వివరాలు చూస్తే కళ్ళు తిరగక మానవు.
టెహ్రాన్‌లోని విలాసవంతమైన ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌లో హనియా హత్యకు గురయ్యాడు. ఈ అతిథి గృహం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఓ పెద్ద భవన సముదాయంలో ఉంది. దీన్ని ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు, ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుంది. ఇక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాస్తుంటాయి. అత్యంత భద్రత నడుమ ఉంటే ఈ గెస్ట్‌హౌస్‌కు హనియా వస్తాడని తెలుసుకుని.. దాదాపు రెండు నెలల కిందటే ఓ బాంబును రహస్యంగా తీసుకొచ్చి దాచిపెట్టినట్లు ఈ కథనం వెల్లడించింది. అప్పటి నుంచి సరైన సమయం కోసం హంతకులు వేచిచూసినట్లు పేర్కొంది.
చాలా జాగ్రత్తలు తీసుకున్నాకే ఆపరేషన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు హనియా ఆ గెస్ట్‌హౌస్‌లోని తన గదిలో ఉన్నట్లు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత హంతకులు రిమోట్‌తో బాంబు పేల్చినట్లు సదరు కథనం తెలిపింది. పేలుడు తీవ్రతకు భవనం తీవ్రంగా ధ్వంసమైందట. కిటికీలు పూర్తిగా పగిలిపోయి గోడ కొంతభాగం కూలినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో హనియాతో పాటు అతడి వ్యక్తిగత సహాయకుడు కూడా మృతిచెందినట్లు టెహ్రాన్ వెల్లడించింది.
హనియా హత్యతో ఉద్రిక్తత పెరుగుతోంది .పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దాడిని ఇజ్రాయిల్ చేయించిందని హమాస్ ఆరోపించింది. ఈ క్రమంలో టెల్ అవీవ్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు సమాచారం. అటు హమాస్ మరో కీలక నేత డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వరుస పరిణామాల తర్వాత హమాస్, ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఐడీఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్ ముప్పు నుంచి టెల్ అవీవ్‌కు భద్రత కల్పిస్తామని అగ్రరాజ్యాధినేత హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.