…………
తెలంగాణ లో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. మన తెలుగు ఆడపడుచులు ఉత్సాహంగా బోనాలు ఎత్తుకొని, అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన బోనాలు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల ఉత్సవం ఆషాఢ మాసంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుక. ఆదివారం బోనాల జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ పెద్దలు పట్టువస్తాలు, బోనాలు సమర్పించారు.
…………
బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ ఆవరణలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కోలాహలం నెలకొంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి భక్తులు, మహిళలు, శివసత్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. శివసత్తులు వివిధ రకాల వేషధారణలతో బోనాలను తలపై పెట్టుకొని నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాల సమర్పిస్తున్నారు.
……….
మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి వెల్లడించారు. బోనాల ఉత్సవంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇది. మన తెలంగాణ సమాజం భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ఆమె తెలియచేశారు.
……
బోనాలు సమర్పించటం వెనుక చాలా ముఖ్యమైన అంశం ఉంది. బోనం ఎత్తుకొన్న ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. తెలంగాణ సంస్క్రతిలో ఆడపడుచులకు ఎంతటి గౌరవం ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అందుచేతనే సంఘ్ స్వయం సేవక్ లు, విశ్వహిందూపరిషత్, దుర్గావాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున బోనాలను ప్రోత్సహిస్తూ ఉంటారు.