ఏపీ సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకే ఉద్యోగులు సిద్ధమయ్యారు. పీఆర్సీ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ నిర్వహించారు. అడుగడుగునా ఆంక్షల్ని ఎదుర్కొంటూ పెద్దసంఖ్యలో విజయవాడ ర్యాలీకి హాజరయ్యారు.
ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులతో విజయవాడ జనసంద్రమైంది. రాష్ట్రం నలుముూలలనుంచి వచ్చిన వేలాదిమందితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అందర్నీ అదుపుచేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పెద్దసంఖ్యలో హాజరయ్యారు. బీఆర్టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది.
ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకుని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యోగులు విజయవాడను చుట్టుముట్టారనవచ్చు. నగరాన్ని పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్డు పొడవునా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారం రోజుల్లో తేల్చేస్తానన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వారాల సమయం తీసుకున్నారని అన్నారు. తాము ప్రసంగాలు ఇవ్వడానికి రాలేదని ఆవేదనను చెప్పుకునేందుకే వచ్చామనీ అన్నారు. తమ ఈ ఉద్యమం కొనసాగుతుందని ర్యాలీలో పాల్గొన్న ఉద్యోగులూ అంటున్నారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ, ఏడునుంచి నిరవధక సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పీఆర్సీ సాధన సమితి హెచ్చరిస్తోంది.