లింగోజీగూడ డివిజన్ వ్యవహారంలో రేగిన కలకలం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. పార్టీ అనుమతి లేకుండా బీజేపీనేతలు ప్రగతి భవన్ వెళ్లి కేటీఆర్ ను కలవడంపై పార్టీ చీఫ్ సంజయ్ ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై తేల్చేందుకు ఆయన నిజనిర్ధారణ కమిటీని కూడా వేశారు. బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్, యండల లక్ష్మీనారాయణ, మల్లారెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ … కేటీఆర్తో భేటీ సందర్భంగా ప్రగతి భవన్లో ఏంజరిగిందో తేల్చనుంది. అందులో భాగంగా…ఇప్పటికే రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డిని త్రిసభ్య కమిటీ విచారించింది. ప్రగతి భవన్కు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో వివరాలు సేకరిస్తున్నారు. కాగా ప్రగతి భవన్కు వెళ్లిన ఇతర నేతలతోనూ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. నివేదిక ఆధారంగా నేతలపై వేటు వేసే ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.