దీదీని సవాల్ చేస్తున్న సంఘ్
నేలకెసి కొడితే నింగికేసి ఎగురుతుంది బంతి. పశ్చిమ బెంగాల్లో సంఘ్ పరివార్ కూడా అలాగే ఎదుగుతున్నది. సీఎం మమతా బెనర్జీ ఎంతగా అణవిచేతకు ప్రయత్నిస్తుంటే అంత బలంగా ఆరెస్సెస్ విస్తరిస్తున్నది. బిజెపి నలువైపుల నుంచీ కమ్ముకొస్తున్నది. కమలం పార్టీ లోక్ సభ సీట్లు 2 నుంచి 18కి పెరిగినప్పుడే తృణమూల్ కాంగ్రెస్ కు ప్రమాద ఘంటికలు మోగాయి. ముఖ్యంగా సంఘ్ శాఖలు పెరిగిన ప్రతి చోటా తృణమూల్ బలహీన పడుతున్నది. బిజెపి బలపడుతున్నది.
మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత గత తొమ్మిదేళ్లలో బెంగాల్ లో బలపడినంత వేగంగా సంఘ్ వేరే రాష్ట్రంలో బలం పెంచుకోలేదని అంటారు. మమత ముస్లిం బుజ్జగింపు రాజకీయాల వల్ల హిందువులు బిజెపి వైపు మళ్లడం చాలా వేగంగా జరుగుతున్నది. ఇప్పుడు బెంగాల్లో ఆరెస్సెస్ దాదాపు 60 వేల దైనిక్ శాఖలు, అంటే ప్రతి రోజూ శాఖలు నిర్వహిస్తున్నది. మరో 20 వేల సాప్తాహిక శాఖలు నడుస్తున్నాయి. మరో 10 వేల మాసిక్, అంటే నెలవారీ శాఖలు నడుస్తున్నాయి.
దుర్గా పూజల కంటే మొహర్రం వేడుకలకే మమతా ప్రభుత్వ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం హిందువులకు నచ్చలేదు. బెంగాల్ లో దుర్గా పూజ అనేది అతి ముఖ్యమైంది. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా నాయకులు దుర్గాపూజ మండపాలకు పోయేవారు. పూజలు చేసే వారు. ప్రజలకు అభివాదం చేసే వారు. ఎందుకంటే దసరా సమయంలో తొమ్మిది రాత్రులు కోట్ల మంది హిందువులు ఆ మండపాలను సందర్శిస్తారు. రాజకీయ నాయకుల దృష్టిలో వాళ్లు ఓటర్లు కదా. కాబట్టి వాళ్లు ఉన్న దగ్గరికి కామ్రేడ్లు కూడా వెళ్లే వారు. మమతా ప్రభుత్వం మితిమీరిన ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం బిజెపికి కలిసి వస్తున్నది. మరో వైపు, బీర్ భూం వంటి జిల్లాల్లో తృణమూల్ మద్దతున్న గూండాల ఆగడాలను తాళలేని ముస్లింలు కూడా బిజెపిలో చేరుతున్నారు. ఇది కూడా మమతకు సవాలుగా మారింది. మరో నాలుగైదు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే బెంగాల్ లోని సభలో సింహగర్జన చేశారు. ఆ లక్ష్యం సాధించడంలో కమలనాథులు నిమగ్నమై ఉన్నారు.