ఇటీవల కేరళ వరదల్లో సేవా భారతి నిర్వహించిన సేవా కార్యక్రమాల మీద రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రశంసలు కురిపించింది. వందల మంది కార్యకర్తలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారని, ఇది అందరికీ స్ఫూర్తిదాయకం అని అభిప్రాయపడింది. కేరళలోని పాలక్కాడ పట్టణంలో ఆర్ఎస్ఎస్ విద్యుత్ క్షేత్రాల సమన్వయ బైఠక్ నిర్మాణాత్మకంగా ముగిసింది.
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలేల మార్గదర్శకత్వంలో సమావేశాలు నిర్వహించారు. వివరాలను అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మీడియా సమావేశంలో వివరించారు.
మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం సమాజంలో అవగాహన పెంచేందుకు స్వయం సేవకులు చొరవ తీసుకోవాలి అని భావిస్తున్నారు. ఇందుకోసం పటిష్టమైన ప్రణాళికను సంఘం రూపొందించింది.
వాయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడటం, నివారణ చర్యలపై దృష్టి సారించడంపై చర్చించారు. ఆర్ఎస్ఎస్-ప్రేరేపిత సంస్థల ద్వారా కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాల గురించి వివరించారు. భవిష్యత్ ప్రమాదాలను తగ్గించడానికి విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందనను పెంపొందించే ప్రయత్నాలు గురించి చర్చించారు.
తమిళనాడులో మతమార్పిడి కార్యకలాపాలపై పెరుగుతున్న ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు, ఆ ప్రాంతం స్థిరంగా, సురక్షితంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో కృషి చేయాలని సదస్సు పిలుపునిచ్చింది.
బంగ్లాదేశ్ లో హిందువులు సహా మైనారిటీల దుస్థితిపై చర్చ జరిగింది. మైనారిటీ కమ్యూనిటీల సమస్యలు పరిష్కరించడానికి, ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో సమాలోచనలు జరపాలని సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరాయి.
వివిధ క్షేత్రాలకు చెందినటువంటి జాతీయస్థాయి నాయకులు ఈ బైఠక్ లలో పాల్గొన్నారు. వివిధ అంశాల మీద కార్యాచరణ రూపొందించుకున్నారు.