ఇటీవల కాలంలో వక్ఫ్ బోర్డ్ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ,, పార్లమెంటు దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించింది. ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ ముంగిట ఈ అంశం నిలిచి ఉంది. ఇదే సమయంలో సనాతన బోర్డు కావాలన్న డిమాండ్ కూడా ఊపందుకొంటోంది.
వక్ఫ్ బోర్డ్ మరియు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశంపై రిథమ్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ ఒక అవగాహన సదస్సు నిర్వహించింది.
జాతీయ వాదాన్ని వినిపిస్తున్న మై ఇండ్ మీడియా దీనికి మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
హైదరాబాద్ ఖైరతాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హిందూవాహిని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ్ రాజ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉండగా ముస్లిం, క్రిస్టియన్స్ కు సంబంధించిన భూములన్నీ ఆయా మత సంస్థల చేతుల్లో సురక్షితంగా ఉన్నాయన్నారు. ఏది వక్ఫ్ ప్రాపర్టీ, ఏది కాదో ఎవరు గుర్తించలేకపోతున్నారని.. చివరకు వక్ఫ్ ట్రిబ్యునల్ చెప్పిందే ఫైనల్ అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొస్తుందని తెలిపారు.
మరో ముఖ్య అతిథి తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని విధాల విడగొట్టేందుకు ఒక కుట్ర పూరితంగా ప్రయత్నాలు జరిగాయని వివరించారు. అసలు ముస్లింలకు భారత్ లో ఎలాంటి ఆస్తులు లేవని.. అలాంటప్పుడు వాటిని కాపాడేందుకు ఒక చట్టం ఎలా తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులన్నీ ఒకప్పుడు వాటిని కాపాడే వారి దగ్గర ఉండేవని.. కానీ ప్రస్తుతం వాటిపై ప్రభుత్వ పెత్తనం ఉందని తెలిపారు. కానీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ముస్లిం, క్రిస్టియన్ ఆస్తులు.. ఇవాళ ఆయా కమ్యూనిటీ లకే అప్పచెప్పారని వివరించారు.
వక్ఫ్ బోర్డుతో ఉండే అనర్ధాలను సోదాహరణంగా వక్తలు విడమరిచి చెప్పారు. సనాతన బోర్డు తెచ్చుకోవలసిన ప్రాధాన్యతను స్పష్టంగా వివరించారు.