ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నాయకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అన్ని విషయాల్లోనూ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆఖరికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లను కూడా వైసిపి నాయకులు అమ్ముకున్నారు అని బయటపడింది. వ్యవహారం మీద భక్తులు మండిపడుతున్నారు
వైసిపి ఎమ్మెల్సీ జఖియాఖాన్.. శ్రీవారి దర్శనం టికెట్లను బ్లాక్ లో అమ్మేశారు అని బయటపడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం కోసం ఎమ్మెల్సీ ఖాన్ సిఫార్సు లేఖపై ఆరు టిక్కెట్లు పొందినట్టు భక్తుడు తెలిపాడు. అధిక ధరకు విక్రయించడంతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అదికారులు విచారణకు ఆదేశించారు.
విజిలెన్స్ విచారణలో ఆరోపణలు నిర్దారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీ జకియా ఖానం, ఆమె పీఆర్వో కృష్ణతేజ సహా ముగ్గురిపై కేసు నమోదయ్యింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జకియా ఖాన్ హవా నడిపించారు.
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానంకు ఎమ్మెల్సీని చేయడమే కాకుండా, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మూడేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో బాగా తిరిగారు అప్పట్లోనే ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు వెళ్లువెత్తాయి. అయినప్పటికీ వైసీపీ పెద్దలకు బాగా కావలసిన నాయకుడు కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
కానీ ఇప్పుడు జకియా ప్లేటు మార్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎందుకో వైసీపీ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ జకియా ఖానం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆమె సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం.
ఈ ఆరోపణలపై జకియా ఖానం స్పందిస్తూ తాను విజయవాడకు బయలుదేరుతున్నట్టు తెలిసీ కావాలనే కొందరు ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించారు. ఆ లేఖ ఇచ్చిన విషయం తనకు తెలియదని, పీఆర్వో కూడా వారం రోజులుగా లేరని ఆమె చెప్పారు.
మరోవంక, వైసిపి ఎమ్యెల్సీ, కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన భరత్ కూడా తోమాల దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ 2.5 లక్షలు తీసుకొని మోసం చేసారన్తి అంటూ గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా దర్యాప్తు మొదలైంది.
తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో వైసిపి ప్రభుత్వం అరాచకానికి పాల్పడిందని బలంగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా టికెట్లు అమ్మకం గురించి కూడా బయటపడడంతో.. వైసిపి నేతల మీద భక్తులు మండిపడుతున్నారు.