హనుమాన్ మాలలో ఉన్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకుండా అడ్డుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బోథ్ మండలం పొచ్చెరలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి హనుమాన్ మాలతో స్కూలుకు వెళ్లాడు. అయితే యాజమాన్యం అతన్ని క్లాస్ రూంలోకి అనుమతించలేదు. మాల తీసి వస్తేనే లోపలికి రానిస్తామని వెనక్కి పంపింది. విద్యార్థి తిరిగి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానిక హిందూసంస్థల నాయకులు స్కూల్ దగ్గరకు చేరుకుని యాజమాన్యం తీరును ప్రశ్నించారు. అయినా వాళ్లు బాలుడిని లోపలకు పంపేందుకు ససేమిరా అనడంతో అక్కడే స్థానికులు సహా ఆయా సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం క్షమాపణలు చెప్పి విద్యార్థిని తరగతిగదిలోకి పంపించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే పదే పదే ఇలాంటిఘటనలు జరుగుతుండడంపై హిందూసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మత విశ్వాసాలను గౌరవించకుండా కొన్ని పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గతంలోనూఅయ్యప్పదీక్ష వేసుకున్న విద్యార్థులను లోపలకు అనుమతించని ఘటనలు జిల్లాలో అనేకసార్లు వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ DEO కు వాళ్లు విజ్ఞప్తి చేశారు.