ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ లోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు చేసింది. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం అయిన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ పై ఆర్మీ బాంబు దాడిచేయడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పైకి చర్చలు జరుపుతూనే దాడులు ముమ్మరం చేసిందని ఉక్రెయిన్ వాపోతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, అపార్ట్ మెంట్లపైనా క్షిపణి దాడులు చేసింది రష్యా.
రష్యా కాల్పులతో అణువిద్యుత్ ప్లాంట్ అగ్నికి ఆహుతైందని, ప్లాంట్ నుంచి పెద్దఎత్తున పొగలు వచ్చాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతెలిపారు. ఆ సమయంలో ఇరు దేశాల దళాలమధ్య తీవ్రమైన పోరే జరిగిందని అన్నారు. జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ పేలితే, దీని ప్రభావం చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధికంగా ఉంటుందని డిమిట్రో కులేబా చెప్పారు.