నోయిడా రోడ్డు మీద అర్థరాత్రి ఒంటరిగా, వేగంగా పరుగెడుతున్న ఓ కుర్రాడి వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానన్నా వద్దంటూ పరుగెడుతూనే ఉన్నాడా పిల్లాడు. ఇంటి దగ్గర దిగబెడతానన్నా వినకుండా పరుగుతీస్తున్న అతనితో తన సంభాషణను వీడియో తీశాడు ఆ కార్లో ఉన్న వ్యక్తి. ఆ వీడియో తీసింది ఓ సెలబ్రిటీ అయితే దాంతో తనూ సెలబ్రిటీ అయ్యాడా కుర్రాడు. వీడియో తీసింది ప్రముఖ ఫిలింమేకర్ వినోద్ కాప్రి అయితే… ఆ కుర్రాడి పేరు ప్రదీప్ మెహ్రా.
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ మెహ్రా తల్లి, తమ్ముడితో కలిసి నోయిడాలో ఉంటున్నాడు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు పందొమ్మిదేళ్ల నవ యువకుడు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్నాడు. రోజూ ఉదయం లేచి, వంట చేసుకుని మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్తాడు. రాత్రిపూట పని ముగించుకుని, తిరిగి ఇంటికొస్తాడు. ఆ సమయంలో ఇంటికెళ్లేందుకు అతను ఎంచుకున్న మార్గం, కాదుకాదు అతనికున్న ఏకైక మార్గం నడకే. అయితే ఎవరైనా లిఫ్ట్ ఇస్తానంటున్నా వినకుండా పరుగెత్తడం వెనక మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆర్మీలో చేరడం అతని కల. అందుకు రన్నింగ్ తో పాటు ఫిజికల్ టెస్టులూ పాసవ్వాలి. అందుకే అతను రోజూ ఇలా పదికిలోమీటర్లు పరుగెత్తుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ పని అర్థరాత్రి ఎందుకు చేస్తున్నాడంటే తను పనిచేయాలి, చదువుకోవాలి. ఓ వైపు కుటుంబ పోషణకు పనిచేస్తూనే మరోవైపు అర్థరాత్రి పరుగు ప్రాక్టీస్ చేస్తున్నాడన్నమాట. అలా పరుగెత్తుతూ వినోద్ కాప్రి కంటపడ్డాడు ప్రదీప్. లిఫ్ట్ ఇస్తానంటే వద్దని…తన ప్రాక్టీస్ దెబ్బతింటుందనీ చెప్పాడు. ఆ సంభాషణను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు వినోద్. ఈ వీడియో చూసి ప్రదీప్ పట్టుదల సంకల్పానికి ముచ్చటపడుతున్నారు నెటిజన్లు. అతని మొక్కవోని దీక్షకు సలాం చేస్తున్నారంతా.
https://twitter.com/vinodkapri/status/1505535421589377025?s=20&t=ngf4qV4iaOwnFSqRqmNLtA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)