మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తోంది. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ వ్యవస్థను ఉపయోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ విధానంలో అటు ఆర్టీసీకి ఇటు మహిళలకు కూడా ఉపయోగం ఉండటం విశేషం.
ప్రస్తుతం ఆర్టీసీ ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకి తీసుకుంటున్నది. ఇకనుంచి ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా మహిళ సంఘాల నుంచి బస్సులను అద్దెకి తీసుకునేట్లుగా యోచన చేస్తున్నారు. మహిళా సంఖామంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను పిలిపించి ఇందుకు తగినట్లుగా మార్గదర్శనం చేశారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులపై డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యాచరణను అధికారులు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో ద్వారా రెండువైపులా ఉపయోగాలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో.. మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాద్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అంతిమంగా మహిళా సంఘాలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. దీని ద్వారా ప్రతి జిల్లాలోనూ మహిళా సంఘాలు బాగా పుంజుకొనే అవకాశం ఉంది.