భాగ్యనగరంలో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరగనున్నాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా…మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్ని నివారించడంతో పాటు…ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నోడల్ బస్ స్టాప్ల వైపు వెళ్లే క్రమంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు నడుస్తాయని ,తిరుగు ప్రయాణాలకు, బస్సులు 12.30 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య తిరుగుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ప్రత్యేక బస్సు సర్వీసు మార్గాలు ఇవీ…
సికింద్రాబాద్ నుండి మేడ్చల్, సికింద్రాబాద్ నుంచి షామీర్పేట, ఉప్పల్ నుంచి కొండాపూర్, దిల్సుఖ్నగర్ నుంచి లింగంపల్లి, మెహదీపట్నం నుంచి శిల్పారామం, కోటి నుండి రామోజీ .. మౌంట్ ఒపెరా, కోటి నుండి ఓషన్ పార్క్, లింగంపల్లి నుంచి ట్యాంక్ బండ్, దిల్సుఖ్నగర్ నుంచి తాన్సుఖ్నగర్ నుంచి , మేడ్చల్ నుండి ట్యాంక్ బండ్, మెహదీపట్నం నుంచి శంకర్పల్లి, విప్రో సర్కిల్ నుంచి మైత్రివనం, కోటి నుంచి కొండాపూర్ మీదుగా జర్నలిస్ట్ కాలనీ, దుర్గం చెరువు, ఐకెఇఎ…లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు.
ట్రాఫిక్ నిబంధనలూ కఠినతరం…
ఇక న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ , అప్పర్ ట్యాంక్ బండ్‌పై వాహనాల రాకపోకలు ఉండవు. బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు ఈ మధ్య రాత్రి ట్రాఫిక్ కోసం మూసివేస్తారు. ఇవాళ, రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు నగర పరిధిలో ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలకు అనుమతి లేదు. ప్రజా భద్రతకోసం పలుచోట్ల ట్రాఫిక్ నూ మళ్లిస్తున్నారు.
ఇంకా అడుగడుగునా అన్ని ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలుంటాయి. వేడుకల్లో ఎవరూ మారణాయుధాలు, లైసెన్స్ ఉన్న తుపాకులైనా పెట్టుకోవడానికి లేదు. సైబరాబాద్‌లో 200, హైదరాబాద్‌లో 200, రాచకొండలో 100కు పైగా చెకింగ్ పాయింట్ల ఏర్పాటు చేశారు. మొత్తం 15వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు.
ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ కచ్చితంగా యూనిఫామ్‌లో ఉండాలి. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలన్నీ వెంటే పెట్టుకోవాలి. అంతేకాదు.. రాత్రిసమయంలో ఎక్కువ కిరాయి డిమాండ్ చేసినా, ప్రయాణీకులను ఇబ్బందిపెట్టినాన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.