పంచ పరివర్తన్ ద్వారా సమాజంలో గొప్ప ఫలితాలు ఉంటాయి అని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ వివిధ క్షేత్రాల సమన్వయ బైఠక్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మార్గదర్శనం చేశారు. పంచ పరివర్తన్ అనే అయిదు అంశాల గొప్పతనం వివరించారు. పర్యావరణం, సామాజిక సమరసత, కుటుంబ విలువలు, స్వధర్మ, నాగరికత ప్రబోధం అనే అంశాల మీద అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.
కేరళ లోని పాలక్కాడ్ పట్టణం లో వివిధ క్షేత్రాల సమన్వయ బైఠక్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీ వరకూ ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశాల్లో సామాజిక అంశాలు, సామరస్యంతో పాటు దేశ భద్రతతో పాటు మొత్తం ఐదు అంశాల గురించి కూలంకషంగా చర్చిస్తున్నారు. పర్యావరణ అనుకూల జీవనశైలి, విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యం, స్వదేశీ, పౌర విధులు ఈ పంచ పరివర్తన్ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు.
ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాల లో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆరెస్సెస్ కార్యకారిణి సభ్యులు, సంఘ్ ను ప్రేరేపిత సంస్థగా భావించే వివిధ సంస్థల నుంచి 230 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సంస్థలన్నింటికీ 50 నుంచి 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర వుంది. ప్రారంభ దశల్లో ఈ సంస్థలు ఆరెస్సెస్ నుంచి కొంత మంది కార్యకర్తలను తీసుకున్నప్పటికీ.. తర్వాత తర్వాత కాలంలో వారే స్వతంత్రంగా తమ తమ సంస్థలను అభివృద్ధి చేసుకున్నారు.
ఈ మాదిరిగా వివిధ క్షేత్రాల మధ్య సమన్వయం చేసే వ్యవస్థ ఈ సమావేశాల్లో వుంటుంది. ఈ సమన్వయ సమావేశంలో ప్రతి సంస్థ కూడా కార్యక్షేత్రాల్లో తమ తమ అనుభవాలను పంచుకోవటం తో పాటు, వారి పోరాటాలు, వారి సాధించిన విజయాలు, సమస్యలను కూడా చర్చిస్తారు. కార్యక్షేత్రంలో తమకు ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అంశాలన్నింటినీ కూలంకషంగా చర్చించుకోవడానికి, పంచుకోవడానికి ఈ సమావేశాలు ఓ వేదికగా నిలుస్తాయి.
వివిధ క్షేత్రాల సమన్వయ సమావేశాలలో సంఘ శతాబ్ది ఉత్సవాలపై కూడా కీలక నిర్ణయం వెలువడవచ్చు.